‘ఆంగ్రియా’ వేదికగా ఒక్కటైన జంట

21 Oct, 2018 19:14 IST|Sakshi

ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఓ మధుర ఙ్ఞాపకం. అలాంటి వేడుకను రొటీన్‌గా కాకుండా కాస్త ప్రత్యేకంగా చేసుకోవాలని కొందరు కోరుకుంటుంటారు. ముంబైకి చెందిన ప్రబీర్‌, సయాలీ కొర్రియాలు కూడా ఆ కోవకు చెందిన వారే. అందుకే ‘ఆంగ్రియా’ వేదికగా సముద్రం మధ్యలో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ‘ఇదొక అందమైన, అరుదైన అనుభూతి. ఇది నా కల. మొదటిసారిగా క్రూయిజ్‌లో ప్రయాణిస్తున్నా’ అంటూ వధువు సయాలీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. భర్తతో కలిసి కేక్‌ కట్‌చేసి తియ్యని వేడుక చేసుకున్నారు.

ఆంగ్రియా.. ది క్రూయిజ్‌!
భారత తొలి లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌ పేరే ఆంగ్రియా. ముంబై నుంచి గోవాల మధ్య ప్రయాణించే ఈ తొలి దేశీయ నౌక వేదికగా.. ‘సముద్రంలో అరుదైన అనుభూతితో ఓ జంట ఒక్కటైంది. ఇలా పెళ్లి వేడుకకు ఆంగ్రియా వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. నౌక కెప్టెన్‌గా నాకు పెళ్లి నిర్వహించే అవకాశం ఉంది’ అంటూ కెప్టెన్‌ ఇర్విన్‌ సీక్వెరియా ఆనందం వ్యక్తం చేశారు. పదిహేనేళ్ల కెరీర్‌లో 60 నౌకలకు కెప్టెన్‌గా వ్యవహరించిన తనకు ఇది కొత్త అనుభూతి అన్నారు. కాగా ఆంగ్రియా ఆరు డెక్‌లు, 104 క్యాబిన్‌లతో చాలా విశాలంగా ఉంటుంది. ఒకేసారి 399 మంది ప్యాసింజర్లను తీసుకువెళ్లగలదు. వర్షాకాలంలో తప్ప మిగతా అన్ని కాలాల్లో వారానికి నాలుగు సార్లు ఈ నౌక ముంబై- గోవాల మధ్య ప్రయాణిస్తుంది. టికెట్‌ ధర 7 నుంచి 12 వేల వరకు ఉంటుంది.

మరిన్ని వార్తలు