కసబ్‌ కాదు.. దినేశ్‌ చౌధరి!

19 Feb, 2020 02:52 IST|Sakshi

ముంబై ఉగ్రదాడులను హిందూ ఉగ్రదాడులుగా చిత్రించాలనుకున్నారు

అందుకే కసబ్‌కు హిందూ పేరుతో నకిలీ ఐడీ కార్డ్‌ సృష్టించారు

ముంబై మారణహోమంపై ఆసక్తికర అంశాలను వెల్లడించిన నాటి ముంబై సీపీ రాకేశ్‌ మారియా పుస్తకం

ముంబై:  భారత్‌పై అనుక్షణం విషం చిమ్మే పాకిస్తాన్‌ ప్రేరేపిత ముంబై ఉగ్రదాడులు గుర్తున్నాయా?  2008లో నవంబర్‌ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలోకి చొరబడి జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 166 మంది చనిపోయారు. ఆ టెర్రరిస్ట్‌ల్లో ప్రాణాలతో పట్టుబడింది అబ్జల్‌ కసబ్‌ మాత్రమే. కసబ్‌ ప్రాణాలతో పట్టుబడటం వల్ల ఈ దాడుల వెనుకనున్న పాక్‌ హస్తం బట్టబయలైంది. కసబ్‌ను హిందూత్వ ఉగ్రవాదిగా చిత్రీకరించి, ఆ దాడులు హిందూత్వ ఉగ్రదాడులుగా చిత్రించాలని కుట్ర పన్నడం, పోలీసులకు చిక్కిన కసబ్‌ను పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, లష్కరే సంస్థలు చంపాలనుకోవడం తదితర ఆసక్తికర అంశాలను ఆ కేసును విచారించిన ముంబై మాజీ సీనియర్‌ పోలీస్‌ అధికారి రాకేశ్‌ మారియా తన పుస్తకం ‘లెట్‌  మి సే ఇట్‌ నౌ’లో కళ్లకు కట్టారు. కేసులో భాగంగా ఆనాడు కసబ్‌ను మారియా విచారించారు.

సోమవారం మార్కెట్లోకి విడుదలైన ఆ పుస్తకంలోని పలు ఆసక్తికర అంశాలివి.. 
►నిజానికి ఐఎస్‌ఐ, లష్కరే ఆ దాడులను 2008లో నవంబర్‌ 26న కాకుండా, సెప్టెంబర్‌ 27వ తేదీన జరపాలనుకున్నాయి. ఆ తేదీ అప్పటి రంజాన్‌ ఉపవాస రోజుల్లో 27వది.  
►కసబ్‌ను హిందూ ఉగ్రవాదిగా చిత్రించాలనుకున్నాయి. అందుకే, కసబ్‌ కుడి చేతికి ఎర్రని దారం కట్టింది. సమీర్‌ దినేశ్‌ చౌధరి అని, బెంగళూరు వాసి అని ఒక నకిలీ ఐడీ కార్డును సృష్టించాయి. భారత భద్రతాదళాల చేతిలో కసబ్‌ చనిపోతాడని, ఆ ఐడీ కార్డు ద్వారా అతడు హిందూ ఉగ్రవాదిగా ముద్రపడ్తాడని, మీడియా కూడా అదే విషయాన్ని ప్రచారం చేస్తుందని, మీడియా సంస్థలన్నీ బెంగళూరుకు వెళ్తాయని భావించాయి. కానీ, వారి ప్లాన్‌ ఫ్లాప్‌ అయింది. కసబ్‌ ప్రాణాలతో చిక్కాడు. ఆ విషయంలో కసబ్‌ను ప్రాణాలను పణంగా పెట్టి పట్టుకున్న కాన్‌స్టేబుల్‌  తుకారాం ఓంబ్లే సాహసం అనన్యసామాన్యం. కసబ్‌ ఐడెంటిటీని వెంటనే బయటపెట్టకుండా పోలీసులు సంయమనం పాటించారు. దాంతో ఆయన అసలు ఐడెంటిటీ బయటపడింది. అతడు పాకిస్తాన్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందిన అజ్మల్‌ అమిర్‌ కసబ్‌గా ప్రపంచానికి వెల్లడి చేయగలిగాం. హైదరాబాద్‌కు చెందిన అరుణోదయ కాలేజ్‌ నకిలీ ఐడీ కార్డులు ఇతర ఉగ్రవాదుల వద్ద లభించాయి. 
►తమ ప్రమేయం బయటపడుతుందని ఐఎస్‌ఐ, లష్కరే భావించాయి. అందుకే భారత్‌లో జైళ్లో  ఉన్న కసబ్‌ను హతమార్చాలని నిర్ణయించి ఆ బాధ్యతను మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌కు అప్పగించాయి. 
►నిజానికి దోపిడీలు చేసి డబ్బులు సంపాదించే ఉద్దేశంతో కసబ్‌ లష్కరే ఉగ్రసంస్థలో చేరాడు. అతడికి జిహాద్‌ అంటే ఏంటో కూడా తెలియదు. అయితే, కసబ్‌ను భారత్‌లో ఉగ్రదాడుల కోసం పంపాలని నిర్ణయించుకున్న తరువాత.. అతడికి భారత వ్యతిరేకత నూరిపోశారు. భారత్‌లో ముస్లింలను నమాజ్‌ చేయనివ్వరని అబద్ధాలు చెప్పారు. మేం ఒకసారి ముంబైలో అతడిని మసీదుకు తీసుకువెళ్లాం. అక్కడ జరుగుతున్న నమాజ్‌ను చూసి కసబ్‌ ఆశ్చర్యపోయాడు. 
►భారత్‌ పంపేముందు కసబ్‌కు వారం పాటు సెలవు ఇచ్చి, రూ. 1.25 లక్షలు ఇచ్చి ఇంటికి పంపించారు. ఆ డబ్బును సోదరి వివాహానికి ఖర్చు చేయమని కుటుంబానికి ఇచ్చాడు. 
►నవంబర్‌ 21, 2012న కసబ్‌ను పుణెలోని ఎరవాడ సెంట్రల్‌ జైళ్లో ఉరి తీశారు

మరిన్ని వార్తలు