ముంబై వాసులు సహనం వీడాల్సిందే!

16 Mar, 2019 14:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘ముంబై వాసులది ఎంత సహనం అంటే, వారి సదుపాయాలను, వారి భద్రతను కూడా ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ విస్మరించేంత వరకు దారితీసిన సహనం’ అని ముంబై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నరేశ్‌ పాటిల్‌ గురువారం నాడు వ్యాఖ్యానించారు. నగరంలో రైల్వే వంతెనలు, డ్రైనేజీకి సంబంధించిన మ్యాన్‌హోల్స్‌ కారణంగా నగరవాసులు మృత్యువాత పడుతున్నారని, ఎన్నిసార్లు వీటి గురించి ఫిర్యాదు చేస్తున్నా ఫలితం ఉండడం లేదంటూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడంపై ప్రధాని న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

జస్టిస్‌ నరేశ్‌ పాటిల్‌ ఈ వ్యాఖ్యలు చేసిన గురువారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో నగరంలోని ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినస్‌లోని పాదాచారుల వంతెన కూలిపోయి అరుగురు ప్రయాణకులు మరణించారు. కనీసం 21 మంది గాయపడ్డారు. కూలిపోయిన వంతెన పక్కనే మున్సిపల్‌ కమిషనర్‌ అజయ్‌ మెహతా కార్యాలయం ఉంది. అయినా ఆయన కొన్ని గంటల వరకు మీడియాకు అందుబాటులోకి రాలేదు.  21 మంది గాయపడ్డారు. రోడ్డు నిర్మాణంలో, మరమ్మతుల్లో నాణ్యత ఉండడం లేదంటూ ముంబై హైకోర్టు కూడా గతంలో అనేక సార్లు మున్సిపల్‌ అధికారులను హెచ్చరించింది. అయినా వారు పట్టించుకున్న పాపాన పోలేదు.

ఒకప్పుడు ముంబై వాసులకు మంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉండేవి. మున్సిపాలిటీ అధికారులు, పాలకులు ఈ బస్సు సర్వీసులను పట్టించుకోవడం మానేసి మౌలిక సదుపాయాలంటూ రోడ్లు విస్తరిస్తూ ప్రైవేటు వాహనాలను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో రోడ్లపై రద్దీ పెరిగింది. ఫలితంగా కాలుష్యం పెరిగింది. ట్రాఫిక్‌ జామ్‌లు పెరిగాయి. కేంద్ర మధ్య రైల్వేలైన్‌లోని కుర్లా రైల్వే స్టేషన్‌కు, పశ్చిమ లైన్‌లోని బండ్రా లైన్‌కు నేడు సరైన బస్సు సదుపాయం లేకుండా పోయింది. ఇరుకైన రోడ్లలో కిలోమీటరున్నర దూరం నుంచి పాదాచారాలు నడుచుకుంటూ స్టేషన్లకు వెళ్లాల్సి వస్తోంది.

ఇదిలావుంటే ముంబై సముద్ర తీరాన 29.2 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాలని పాలకులు నిర్ణయించారు. ఇందులో పది కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేయడానికి 12,700 కోట్ల రూపాయలను కేటాయించారు. అంటే కిలో మీటరుకు 1200 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందన్న మాట. మొత్తం నగర జనాభాలో 1.25 శాతం మంది ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఈ రోడ్డుకు ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం సమంజసమా ? నగరంలో అన్ని రోడ్లను, వంతెనలను అభివృద్ధి చేసిన తర్వాత ఇలాంటి ప్రాజెక్టులను చేపడితే ఎవరు శంకించరు. ఇక ముంబై సహనం వీడాల్సిన సమయం వచ్చింది. (చదవండి: ఈ ఘోరానికి బాధ్యులెవరు?)

మరిన్ని వార్తలు