రైతుకు దన్ను.. మోదీ ముందు 3 మార్గాలు

29 Dec, 2018 02:37 IST|Sakshi

1. ఎకరాకు రూ.1,700–2,000 చొప్పున జమచేస్తే ప్రభుత్వంపై  రూ.లక్ష కోట్ల భారం

2. నష్టపోయిన రైతులకు పరిహారమిస్తే రూ.50వేల కోట్ల భారం

3. లక్షలోపు రుణాలను మాఫీ చేస్తే 3లక్షల కోట్ల భారం

సంక్షోభంలో చిక్కుకున్న రైతులను ఆదుకునే యోచనలో కేంద్రం

లోక్‌సభ ఎన్నికల కోసం గాలం

న్యూఢిల్లీ: పంటలకు గిట్టుబాటు ధర లభించక నష్టపోయిన రైతులకు ఊరట కలిగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. సొంత భూమి ఉన్న రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా కొంత డబ్బు జమ చేయడం, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే తక్కువకే పంటలను విక్రయించి నష్టపోయిన రైతుకు పరిహారం అందజేయడం, రుణ మాఫీ పథకం అమలు చేయడం ఇందులో ఉన్నాయి.

‘స్థూలంగా ప్రభుత్వం మూడు మార్గాలను పరిశీలిస్తోంది..అవి రుణమాఫీ, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపు, నేరుగా రైతులకే డబ్బు బదిలీ ఇందులో ఉన్నాయి’ అని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అయితే, ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేయాలనే దానిపై తుది నిర్ణయానికి రాలేదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి గ్రామీణ ప్రాంత ఓటర్లే కారణం. కానీ, పంటల ధరల నిర్ణయంలో మార్కెట్‌లదే పైచేయి కావడం, ప్రభుత్వ జోక్యం తగ్గడంతో రైతులు ప్రస్తుతం మోదీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు.

రెండేళ్లుగా దేశవ్యాప్తంగా పంటల దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, ధరలు పడిపోవడం, ఎగుమతులు తగ్గడంతో రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. దీంతో 26 కోట్లకు పైగా ఉన్న రైతులు సుమారు రూ.3 లక్షల కోట్లకు పైగా నష్టపోయినట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఇటీవల మూడు కీలక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని, 2019 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకున్న కేంద్రం రైతులకు, వారి కుటుంబాలకు ఊరట కలిగించాలని తీవ్రంగా యోచిస్తోంది. ఎన్నికల లోపే రైతులందరికీ నేరుగా, సులువుగా డబ్బును అందించే ఈ మూడు మార్గాల్లో దేనిని అమలు చేసినా ఖజానాపై భారీగానే భారం పడనుంది.  

ఆ మూడూ ఇవే..
మొదటిది..సత్వరం అమలు చేయటానికి వీలైనదీ, ప్రభుత్వ వర్గాలు కూడా సానుకూలంగా ఉన్న ప్రత్యామ్నాయం తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు బంధు’ మాదిరి పథకం. దీని కింద సొంత భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఎకరానికి రూ.1,700 నుంచి రూ.2,000 చొప్పున ప్రభుత్వం జమ చేయడం. ఈ పథకం అమలుకు సుమారు రూ.లక్ష కోట్లు అవసరమవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది.

ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కంటే తక్కువకే తమ పంటలను విక్రయించుకుని నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడం రెండో ప్రత్యామ్నాయం. దీనిని అమలు చేస్తే రూ.50వేల కోట్లతోనే సరిపోతుంది. ఇక మూడోది.. అత్యంత ఖరీదైంది..ప్రభుత్వ వర్గాల్లో అంతగా సానుకూలత లేని రైతు రుణమాఫీ. దేశ వ్యాప్తంగా రూ.లక్షలోపు ఉన్న రైతురుణాలకు మాఫీ వర్తింప జేస్తే దేశ ఖజానాపై కనీసం రూ.3 లక్షల కోట్ల భారం పడుతుందని అధికార వర్గాల అంచనా. ఇప్పటికే ఈ పథకాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ తన ఎజెండాగా ప్రకటించుకుంది.

సకాలంలో చెల్లిస్తే వడ్డీ మాఫీ!
న్యూఢిల్లీ: సకాలంలో చెల్లించే రైతుల పంట రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని కేంద్రం యోచిస్తోంది. వ్యవసాయ రంగ సంక్షోభాన్ని, రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూ.15వేల కోట్ల మేర ఉన్న వడ్డీ భారాన్ని భరించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతోపాటు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద రైతు చెల్లించే ప్రీమియం మొత్తాన్ని ఆహార ధాన్యాల పంటలకు పూర్తిగాను, ఉద్యాన పంటలకు కొంత మేర రద్దు చేసే ప్రతిపాదనలను పరిశీలిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రైతులకు రూ.3 లక్షల వరకు 7 శాతం వడ్డీపై బ్యాంకులు స్వల్ప కాలిక రుణాలిస్తున్నాయి. కానీ, సకాలంలో తిరిగి చెల్లించే రైతుల నుంచి మాత్రం 4శాతం వడ్డీనే తీసుకుంటున్నాయి.

సాధారణంగా 9 శాతం వడ్డీని రుణాలపై బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. సకాలంలో రుణాలు చెల్లించే రైతులందరికీ ఈ మాఫీ వర్తింప జేస్తే కేంద్రం రూ.30వేల కోట్ల వరకు భరించాల్సి ఉంటుందని అంచనా. ఈ ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఇచ్చే రుణ వితరణ లక్ష్యాన్ని రూ.11 లక్షల కోట్ల నుంచి రూ.11.69 లక్షల కోట్లకు ప్రభుత్వం పెంచిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.  ఢిల్లీలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ..‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా త్వరలోనే మరిన్ని నిర్ణయాలు ప్రకటించనుంది’ అని తెలిపారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌∙అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది.  

మరిన్ని వార్తలు