ప్లాస్టిక్‌ వాడకం ఆపేద్దాం

28 May, 2018 02:33 IST|Sakshi

మొక్కలు నాటి.. చెట్లు అయ్యేంతవరకు దృష్టిపెడదాం

మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ: నాసిరకం ప్లాస్టిక్, పాలిథిన్‌ కవర్లను వాడటాన్ని ఆపేయాలని దేశ ప్రజలను మోదీ కోరారు. వీటి వలన పర్యావరణం, మూగజీవాలతోపాటు ప్రజల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. మాసాంతపు మన్‌కీబాత్‌ సందర్భంగా ఆదివారం దేశప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినం జరుపుకోవాలని.. ఈ సందర్భంగా మొక్కలు నాటి, అవి చెట్లు అయ్యేంతవరకు దృష్టిపెట్టాలని కోరారు. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని మోదీ కోరారు. ‘యోగాతో మనలో విశ్వాసం పెరుగుతుంది, అందుకే రోజూ యోగా చేయటం అలవర్చుకోవాలి’ అని ఆయన చెప్పారు. జూన్‌ నెలలో రానున్న రంజాన్‌ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.   తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి (మే 27), భారత స్వాతంత్య్ర సంగ్రామంలో స్ఫూర్తి నింపిన వీర్‌ సావర్కర్‌ జయంతి (మే 28)ల సందర్భంగా ఆయన నివాళులర్పించారు.  

ధైర్య సాహసాలకు సలాం!
మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా ఆశ్రమ పాఠశాలకు చెందిన ఐదుగురు గిరిజన విద్యార్థులు (మనీశా, ప్రమేశ్, ఉమాకాంత్, కవిదాస్, వికాస్‌) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన సందర్భంగా వారిని మోదీ ప్రశంసించారు. ‘మిషన్‌ శౌర్య’లో భాగంగా 2017 ఆగస్టులో వివిధ ప్రాంతాల్లో వీరు శిక్షణ పొందారని.. ధైర్య, సాహసాలను ప్రదర్శిస్తూ ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారన్నారు. నేపాల్‌ వైపునుంచి ఎవరెస్టును అధిరోహించిన అతిచిన్న వయస్కురాలైన భారతీయురాలిగా నిలిచిన శివాంగి పాఠక్‌ (16)ను కూడా మోదీ అభినందించారు. ఐఎన్‌ఎస్‌వీ తరుణిలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన బృందం సభ్యురాళ్లను మోదీ ప్రశంసించారు.

యువతకు ఫిట్‌నెస్‌ మంత్ర
భారత సంప్రదాయ క్రీడలైన ఖో–ఖో, గిల్లి దండ, బొంగరం, పతంగులు ఎగురవేయటం వంటి వాటిని పూర్తిగా విస్మరిస్తున్నామని ప్రధాని తెలిపారు. పాఠశాలలు, యువత మండళ్లు ఇలాంటి క్రీడలను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ప్రతి చిన్నారి జీవితంలో క్రీడలు భాగంగా ఉండేవని.. అలాంటి పరిస్థితిని తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. యువత ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని సూచించిన ప్రధాని.. ‘హమ్‌ ఫిట్‌ హైతో ఇండియా ఫిట్‌’ చాలెంజ్‌లో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారన్నారు.  

మరిన్ని వార్తలు