అయోధ్యలో మోడీ రామజపం

6 May, 2014 00:51 IST|Sakshi
అయోధ్యలో మోడీ రామజపం

మాట తప్పిన కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని పిలుపు
ఫైజాబాద్‌లో రాముడు, రామాలయ చిత్రాలున్న సభలో ప్రసంగం
సభపై నివేదిక కోరిన ఎన్నికల సంఘం

 
 ఫెజాబాద్ (ఉత్తరప్రదేశ్): బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని రామనామ జపంతో హోరెత్తిం చారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు, దానికి మద్దతిస్తున్న వారికి శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యవాసులు గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మోడీ సోమవారం అయోధ్య సమీపంలోని ఫైజాబాద్‌లో శ్రీరాముడి, ప్రతిపాదిత అయోధ్య రామాలయ చిత్రాలతో అలంకరించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ఓట్ల కోసం తన ప్రసంగంలో చాలాసార్లు రామనామాన్ని జపించిన మోడీ రామమందిరాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ‘ఇది రాముడి  భూమి. ప్రాణం పోయినా మాట తప్పకూడదనే ప్రజలు నివసిస్తున్న భూమి. వాగ్దానాలను ఉల్లంఘించిన వారిని మీరు క్షమిస్తారా?’ అని ప్రజలనుద్దేశించి అన్నారు. అధికారంలోకి వస్తే 10 కోట్ల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు.

ఎస్పీ, బీఎస్పీలు యూపీలో శత్రువులని, ఢిల్లీలో మాత్రం స్నేహితులని ధ్వజమెత్తారు. ‘అవి తల్లీకొడుకుల (సోనియా, రాహుల్) ప్రభుత్వాన్ని కాపాడతాయి. కాంగ్రెస్.. సీబీఐ నుంచి వాటిని కాపాడుతుంది’ అని విమర్శించారు. ‘రామభూమికి ప్రణమిల్లుతున్నా. మహాత్మాగాంధీ సుపరిపాలను రామరాజ్యంగా నిర్వచించారు. ఆ రాజ్యంలో ఎవరికీ అన్యాయం జరగొద్దు. రజకుడికి కూడా న్యాయం దక్కాలి’ అని అన్నారు. మోడీ ప్రసంగం మధ్యమధ్యలో సభికులు జైశ్రీరామ్ అంటూ నినదించారు. కాగా, ఈ సభలో మోడీ  ప్రసంగం, సభా వేదికపై రాముడి పోస్టర్‌లకు సంబంధించి నివేదిక ఇవ్వాలని ఈసీ జిల్లా అధికారులను కోరింది. రాముడి చిత్రం ద్వారా ఎన్నికల ప్రచారానికి మతాన్ని వాడిన మోడీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఈసీకి కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

 అమేథీలో కాంగ్రెస్‌పై ధ్వజం: రాహుల్ లోక్‌సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ కంచుకోట అమేథీలో మోడీ  వేడి పుట్టించారు. బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ తరఫున ప్రచారం నిర్వహించారు. క్రోధ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు తనపై రాహుల్ చేస్తున్న విమర్శలను ఖండించారు. ఆ రాజకీయాలు కాంగ్రెస్‌కే సొంతమన్నారు. తాను ప్రతీకారం కోసం అమేథీకి రాలేదని, వెనుకబడిన ఈ ప్రాంతంలో మార్పు కోసమే వచ్చానన్నారు.

 ఓడిపోతే మళ్లీ టీ అమ్ముకుంటా:‘నేను ఓడిపోతే నా కెటిల్ సిద్ధంగా ఉంది. నేను తిరిగెళ్లిపోయి టీ అమ్ముకుంటా’నని మోడీ అమేథీలో అన్నారు. టీ అమ్మిన వ్యక్తి తనను సవాల్ చేస్తున్నాడని కాంగ్రెస్ వెర్రెత్తిపోతోందని, పేద కుటుంబంలో పుట్టడం నేర మా అని ప్రశ్నించారు. తన గౌరవం అమేథీ ప్రజల చే తుల్లో ఉం దని ఉద్వేగంగా అన్నారు. పార్టీల అగ్రనేతలు సాధారణంగా ప్రత్యర్థుల నియోజకవర్గాల్లో ప్రచారానికి దూరంగా ఉంటున్న నేపథ్యంలో మోడీ అమేథీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమేథీలో మోడీకి మద్దతుగా 4 నెలల నుంచే ప్రత్యేకంగా రూపొందించిన నాలుగు చక్రాల వాహనాల్లో పెద్ద ఎల్‌సీడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి, ఆయన ప్రసంగాలు వినిపిస్తున్నారు.     

>
మరిన్ని వార్తలు