జాతి ప్రయోజనాలు పణం

22 Feb, 2015 03:30 IST|Sakshi

కార్పొరేట్ గూఢచర్య
నిందితులపై పోలీసుల ఆరోపణ
వారి వద్ద జాతీయ భద్రత పత్రాలు లభించాయని వెల్లడి


న్యూఢిల్లీ: కార్పొరేట్ గూఢచర్యంలో తాము అరెస్ట్ చేసిన ప్రముఖ పెట్రో కంపెనీల సీనియర్ ఉద్యోగుల వద్ద లభించిన రహస్య పత్రాల్లో జాతీయ భద్రతకు సంబంధించినవి కూడా ఉన్నాయని ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టుకు వెల్లడించారు. దేశ ప్రయోజనాలను పణంగా పెట్టిన ఈ కేసులో నిందితులపై అధికార రహస్యాల చట్టాన్ని వర్తింపజేసే అంశాన్నీ పరిశీలిస్తున్నామని ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి సంజయ్ ఖనగ్వాల్‌కు విన్నవించారు.

వారి నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నందున శైలేశ్ సక్సేనా(కార్పొరేట్ వ్యవహారాల మేనేజర్- రిలయన్స్ ఇండస్ట్రీస్), వినయ్‌కుమార్(డీజీఎం- ఎస్సార్), కేకే నాయక్(జీఎం- కెయిర్న్స్), సుభాష్ చంద్ర(సీనియర్ ఎగ్జిక్యూటివ్-జూబిలెంట్ ఎనర్జీ), రిషి ఆనంద్(డీజీఎం-రిలయన్స్ అనిల్ ధీరూభాయి అంబానీ గ్రూప్-అడాగ్)లను 5 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీన్ని నిందితుల న్యాయవాదులు వ్యతిరేకించారు. 

అనంతరం ఆ ఐదుగురిని 3 రోజుల(ఫిబ్రవరి 24వరకు) పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. మరోవైపు, ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శుక్రవారం అరెస్ట్ చేసిన పెట్రో కన్సల్టెంట్ ప్రయాస్ జైన్ ఆఫీసును శనివారం క్షుణ్ణంగా సోదా చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదా సందర్భంగా జూబిలెంట్ ఎనర్జీ సీనియర్ అధికారి సుభాష్ చంద్రను తమతో తీసుకెళ్లారు.

అనంతరం నోయిడాలో ఉన్న జూబిలెంట్ ఎనర్జీ కార్యాలయంలోని సుభాష్ ఆఫీస్ గదిని తనిఖీ చేశారు. జూబిలెంట్ ఎనర్జీ సహా ఇంధన రంగంలోని ఐదు ప్రముఖ కంపెనీల సీనియర్ ఉద్యోగులను, ఇద్దరు స్వతంత్ర పెట్రో కన్సల్టెంట్లు ప్రయాస్ జైన్, శంతన్ సైకియాలను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడం తెలిసిందే. అంతకుముందు శాస్త్రి భవన్‌లో పెట్రోలియం శాఖ కార్యాలయం నుంచి రహస్య పత్రాలను దొంగతనం చేసిన ఇద్దరు పెట్రోలియం శాఖ చిరుద్యోగులు, ముగ్గురు మధ్యవర్తులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

‘ఎప్పట్నుంచి ఈ గూఢచర్యం జరుగుతుందో? దీనివల్ల ఎవరు ప్రయోజనం పొందుతున్నారో? ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరో? తెలుసుకునే దిశగా దర్యాప్తును కొనసాగిస్తున్నామ’ని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కేసు మూలాల్లోకి వెళ్తామని, అందుకు అవసరమైతే మరిన్ని దాడులు, సోదాలు జరుపుతామని, మరింతమందిని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.  ఆ ఐదుగురు ఉన్నతోద్యోగుల వద్ద నుంచి ల్యాప్‌టాప్‌లను, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. తమ సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు వారు ఈ పని చేసి ఉండొచ్చని, ఆ దిశగానూ దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.  


దోషులను వదిలిపెట్టం: రాజ్‌నాథ్
ఈ గూఢచర్యానికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారం చాన్నాళ్లుగా సాగుతోందని స్పష్టమవుతోందని, ఎన్డీఏ ప్రభుత్వం అప్రమత్తత వల్లనే ఈ స్కాం వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ గూఢచర్యంతో లబ్ధి పొందిన పెద్దలపై దృష్టి పెట్టాలని పోలీసులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సూచించారు.


‘పదివేల కోట్ల స్కామ్..’ ‘ఇది పదివేల కోట్ల రూపాయల స్కాం. దీన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నందువల్లనే నన్ను ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారు’.. పోలీసులు కోర్టులోకి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న విలేకరులను చూస్తూ మాజీ జర్నలిస్ట్, స్వతంత్ర పెట్రో కన్సల్టెంట్ శంతను సైకియా గట్టిగా అరుస్తూ చేసిన వ్యాఖ్యలివి. పెట్రోలియం శాఖ కార్యాలయం నుంచి దొంగతనానికి గురైన పత్రాలు ఆయన వద్ద లభించాయి. తనను తాను సమర్ధించుకునేందుకు సైకియా అలా చెప్పి ఉండొచ్చని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ‘పెట్రోలియం శాఖ కార్యాలయం నుంచి తస్కరణకు గురైన పత్రాలకు సంబంధించిన కేసు ఇది. తన వద్ద ఉన్న సమాచారాన్ని ఆయన పోలీసులకు చెప్పాలి’ అన్నారు.

మరిన్ని వార్తలు