‘నా స్థానంలో కోహ్లీ ఉంటే ఏం చేసేవాడు..?’

20 Sep, 2018 09:03 IST|Sakshi
పంజాబ్‌ మంత్రి నవజోత్‌ సింగ్‌ సిద్దూ(ఫైల్‌ ఫోటో)

చండీఘఢ్‌ : ‘ఒకవేళ ఇమ్రాన్‌ ఖాన్‌ వచ్చి కోహ్లి.. నేను నిన్ను హగ్‌ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే అప్పుడు విరాట్‌ కోహ్లి నాకిష్టం లేదని చెప్పగలరా’ అంటూ మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజోత్‌ సింగ్‌ సిద్దూ ప్రశ్నించారు. ఆసియా కప్‌లో భాగంగా నిన్న భారత్‌ - పాకిస్తాన్‌ మ్యాచ్‌ సందర్భంగా సిద్దూ ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి హజరైన సిద్దూ ఈ సందర్భంగా పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకున్న విషయంలో విమర్శలు ఎదుర్కొం‍టున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో నవ్‌జోత్‌ ఒక ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ ‘ఇప్పుడు భారత్‌ - పాక్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఇలాంటి సమయంలో మన క్రికెటర్లు మేం పాకిస్తాన్‌ ఆటగాళ్ల మొహం చూడం అని చెప్పి వారికి తమ వెన్ను చూపగలరా’ అంటూ ప్రశ్నించారు. అలానే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ వచ్చి ‘హాయ్‌ కోహ్లి.. మీరంటే నాకు చాలా ఇష్టం నేను మిమ్మల్ని కౌగిలించుకోవాలని అనుకుంటున్నాను.. అంటే అప్పుడు కోహ్లి అందుకు ‘నాకిష్టం లేదు’ అని చెప్పి మొహం తిప్పుకుని వెల్లలేరు కదా’ అన్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే తనకు ఎదురయ్యాయని అందుకే తాను పాక్‌ ఆర్మీ చీఫ్‌ని ఆలింగనం చేసుకోవాల్సి వచ్చిందని వివరించారు.

గత నెల పాకిస్తాన్‌ ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి హజరైన సందర్భంగా పాక్‌ ఆర్మీ చీఫ్‌ను ఆలింగనం చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే సిద్దూ ఈ విషయం గురించి స్పందిస్తూ అతనే నా ముందుకు వచ్చి ఒకప్పుడు క్రికెటర్ కావాలని అనుకున్నట్లు చెప్పారు. అంతే కాదుసిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పాకిస్థాన్‌లో ఉన్న కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ కారిడార్‌ను తెరవడానికి  సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నేను ఆప్యాయంగా మాట్లాడాను. అందులో తప్పేం ఉంది’  అని సిద్ధూ పేర్కొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు