CWC 2023: 11 ఏళ్ల తర్వాత వికెట్‌ తీసిన హిట్‌మ్యాన్‌.. ఇదే మ్యాచ్‌లో కోహ్లి కూడా..!

13 Nov, 2023 08:48 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అదిరిపోయే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగి పసికూనను మట్టికరిపించారు. తొలుత బ్యాటింగ్‌లో కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) రెచ్చిపోగా.. అనంతరం బౌలర్లు తలో చేయి వేసి గెలిపించారు. 

A post shared by ICC (@icc)

ఈ మ్యాచ్‌లో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రపంచకప్‌లో తొలిసారి తొమ్మిది మంది భారత బౌలర్లు బౌలింగ్‌కు దిగారు. రెగ్యులర్‌ బౌలర్లతో పాటు విరాట్‌, రోహిత్‌, గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ లాంటి ఫుల్‌టైమ్‌ బ్యాటర్లు బౌలింగ్‌ చేశారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. చాలాకాలం తర్వాత బంతిపట్టిన విరాట్‌, రోహిత్‌ తలో వికెట్‌ పడగొట్టి, భారత అభిమానులకు ప్రత్యేక అనుభూతిని కలిగించారు. విరాట్‌ తొమ్మిదేళ్ల తర్వాత.. రోహిత్‌ 11 ఏళ్ల తర్వాత వన్డే వికెట్ తీసి  ఫ్యాన్స్‌కు దీపావళి కానుక అందించారు.

A post shared by ICC (@icc)

విరాట్‌.. స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ వికెట్‌ తీయగా, రోహిత్‌.. నెదర్లాండ్స్‌ టాప్‌ స్కోరర్‌ తేజ నిడమనూరు వికెట్‌ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో విరాట్‌, రోహిత్‌ వికెట్‌ తీసిన వైనం రాహుల్‌, శ్రేయస్‌ మెరుపు శతకాలను సైతం మరుగున పడేసింది. రోహిత్‌ చివరిసారిగా 2012 ఫిబ్రవరిలో వన్డే వికెట్‌ తీశాడు. నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ ఆసీస్‌ ఆటగాడు మాథ్యూ వేడ్‌ వికెట్‌ (క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌) దక్కించుకున్నాడు. రోహిత్‌ తన కెరీర్‌లో తొమ్మిది వన్డే వికెట్లు, రెండు టెస్ట్‌ వికెట్లు, ఓ టీ20 వికెట్‌ పడగొట్టాడు.

మరిన్ని వార్తలు