మోదీ, షాలను దూషించిన రచయిత.. అరెస్ట్‌

2 Jan, 2020 08:46 IST|Sakshi

సాక్షి, చెన్నై: పౌర నిరసనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షాలకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రముఖ వ్యాఖ్యాత, రచయిత నెల్లై కన్నన్‌ పేల్చిన మాటల తూటాలు పెను వివాదానికి దారి తీశాయి. ఆయన్ను అరెస్టు చేయాలని పట్టుబడుతూ, మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ రాష్ట్ర నేతలు బైఠాయించడం ఉత్కంఠకు దారి తీసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నెల్లై కన్నన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మోదీ, షాలను దూషించినందుకు అతన్ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. కన్నన్‌పై ఐపీసీ సెక్షన్‌ 504, 505(1), 505(2) వివిధ సెక్షన్ల్‌  కింద కేసులు నమోదయ్యాయి.

​కాగా పౌరహక్కు చట్టం సవరణను ఖండిస్తూ తమిళనాడు వ్యాప్తంగా విపక్షాలు మంగళవారం పెద్ద ఎత్తున  నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ సందర్భంగా మోదీ, షాను దూషిస్తూ నెల్లై కన్నన్‌ పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో దీనిని ఖండిస్తూ తమిళనాడు వ్యాప్తంగా బీజేపీ ధర్నాలకు దిగింది. ఆయన మీద బీజేపీ వర్గాలు కన్నెర్ర చేశాయి. ఆయన మీద పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో నెల్లై కన్నన్‌ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం నాలుగు గంటలలోపు నెల్‌లైకన్నన్‌ను అరెస్టు చేయకుంటే, మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించాల్సి ఉంటుందని పోలీసుల్ని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్‌ రాజా ట్విట్టర్‌ ద్వారా హెచ్చరించారు. పలు చోట్ల వీరిని బుజ్జగించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది. చివరికి గురువారం ఉదయం ఆయన్ని అరెస్ట్‌ చేశారు. మరోవైపు రంగోలితో నిరసనలు పెరుగుతుండటంతో కేసులు పెట్టాలా..? వద్దా ..? అనే అయోమయంలో పోలీసులు ఉన్నారు.

మరిన్ని వార్తలు