Rajasthan Elections 2023: అంత దురహంకారమా.. ఫేక్‌ అని మహిళలను అవమానిస్తారా?

20 Nov, 2023 18:46 IST|Sakshi

పాలి (రాజస్థాన్): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పేదలకు, రైతులకు, మహిళలకు వ్యతిరేకమని, గెహ్లాట్ హయాంలో మహిళలపై నేరాల్లో ఆ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలిచిందని ఆరోపించారు.

రాజస్థాన్‌లోని పాలీలో సోమవారం జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మహిళలపై నేరాల్లో కాంగ్రెస్ రాజస్థాన్‌ను నంబర్‌ వన్‌గా నిలిపిందని, పైగా మహిళలు ఇచ్చిన ఫిర్యాదులే ఫేక్‌ అని సీఎం గెహ్లాట్‌ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మహిళలను అవమానించడం కాదా అని ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వం ఉన్నరాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు త్వరితగతిన, సమర్థంగా  అమలవుతన్నాయని మోదీ పేర్కొన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అదనంగా రూ. 6,000 అందిస్తున్నాయని, రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇక్కడ కూడా రూ.6 వేలు అదనంగా అందిస్తామన్నారు.

ఇక సనాతన ధర్మానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విపక్షాల కూటమిపైనా ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అది ‘దురహంకార కూటమి’ అని అభివర్ణించారు. వారు సనాతన ధర్మాన్ని అవమానించడం ఇది మొదటిసారి కాదని పేర్కొన్నారు.  కాంగ్రెస్‌ తమ ప్రయోజనాల కోసం దళితులను వాడుకుంటోందన్నారు. దళితులు, మహిళలపై కాంగ్రెస్‌ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మీరూ చూస్తున్నారు కదా అక్కడి మహిళలకు గుర్తు చేశారు. 

మహిళలకు రిజర్వేషన్ కల్పించే 'నారీశక్తి వందన్ చట్టం' ఆమోదించినప్పటి నుంచి మహిళలపై వారి దురహంకారం మరింత ఎక్కువైందన్నారు. ఆ దురహంకార కూటమి నాయకులు మహిళల గురించి చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనన నియంత్రణపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. నితీష్‌ కుమార్‌ వ్యాఖ్యలను ఏ ఒక్క కాంగ్రెస్‌ నేత ఖండించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు