ఇందిరా గాంధీని పొగిడిన కేంద్ర మంత్రి

7 Jan, 2019 19:03 IST|Sakshi

న్యూఢిల్లీ : వెనకబడిన అగ్రవర్ణకులాలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా.. మరో వైపు మహిళా రిజర్వేషన్ల గురించి కూడా ఆందోళన ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎటువంటి రిజర్వేషన్‌ లేకుండానే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారంటూ పొగిడారు.

నాగపూర్‌లోని ఓ కార్యక్రమానికి హజరైన నితిన్‌ గడ‍్కరీ మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్లకు నేను వ్యతిరేకం కాను. కానీ కులం, మతం ప్రతిపాదికన ఇచ్చే రిజర్వేషన్లను నేను వ్యతిరేకిస్తున్నాను అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఉద్దేశిస్తూ.. ఆమె ప్రధాని అయ్యేనాటికి పార్టీలో ఎందరో గొప్ప పురుష రాజకీయ నాయకులున్నారు. కానీ ఆనతికాలంలోనే ఆమె గొప్ప రాజకీయనాయకురాలిగా ఎదిగారు. అది కూడా  ఎటువంటి రిజర్వేషన్లు లేకుండా అంటూ చెప్పుకొచ్చారు. జ్ఞానం ఆధారంగా ఒక మనిషి గొప్పతనాన్ని గుర్తించాలి కానీ కులం, భాష, ప్రాంతం, మతం ఆధారంగా కాదంటూ వ్యాఖ్యనించారు.

మరిన్ని వార్తలు