కాలశకలమై మిగిలిన జ్ఞాపకం

20 Nov, 2023 00:15 IST|Sakshi
లండన్‌లో మార్గరెట్‌ థాచర్‌తో ఇందిరా గాంధీ, ఇందిరతో సేనాపతి శామ్‌ మానెక్‌శా

కామెంట్‌

సీజర్‌ విషయంలో జరిగినట్లే ఇందిరా గాంధీకీ జరిగింది! ఆమె మంచి అంతా ఆమె చితాభస్మంతో పాటుగా నీటిలో కలిసిపోయింది. మనం గుర్తుపెట్టుకున్నది చెత్తను మాత్రమే! ఇండో–పాక్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ను భారత్‌ ఓడించిందనీ, బంగ్లాదేశ్‌ ఆవిర్భవించిందనీ శ్రీమతి గాంధీ ప్రకటించిన రోజు ఈనాటికీ ఎంతో ఉత్తేజభరితమైనది. ఆ తర్వాతి రోజో, లేక ఆ మర్నాడో ఆమె పీఎల్‌–480 ఆహార సహాయ ఒప్పందాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తూ ప్రెసిడెంట్‌ నిక్సన్‌కు లేఖ రాయడం అమెరికా పక్షపాత వైఖరికి దీటైన సమాధానం. అయినప్పటికీ నాటి ఇండో–పాక్‌ యుద్ధంలో భారత్‌ ఘన విజయానికి కారకుడిగా ఈరోజున మనం శామ్‌ మానెక్‌షాను సరిగ్గానే కీర్తిస్తున్నాం కానీ, అందులో శ్రీమతి గాంధీ పాత్రను మాత్రం అన్యాయంగా తిరస్కరిస్తున్నాం.

ఒకవేళ నేటికీ ఆమె సజీ వంగా ఉండి ఉంటే, తన 106 ఏళ్ల వయసులో ఉండేవారు (నవంబర్‌ 19న జయంతి). ఆమె హత్యకు గురయ్యారన్న నాలుగు దశాబ్దాల నాటి వాస్తవం నేడొక వెలిసిపోయిన జ్ఞాప కంగా మాత్రమే మిగిలినప్పుడు ఇందిరాగాంధీని నేనిలా గుర్తు చేసుకోవడం చిత్రమైన సంగతే. అయితే సఫ్దర్‌జంగ్‌ రోడ్డులోని ఆమె స్మారక చిహ్నాన్ని సందర్శించే అసంఖ్యాక జనసమూహానికి అదొక పర్యాటక ఆకర్షణ. తక్కిన మనందరికీ గతించి పోయిన కాల శకలం. ఎమర్జెన్సీ (అత్యవసర పరి స్థితి) తప్ప, మరేదీ మన మదిలో లేనిది. 

తొలిసారి నేనామెను నిబిడాశ్చర్యంతో చూశాను. అది 1975. ఎమర్జెన్సీ పరిస్థితులు పరా కాష్ఠకు చేరుకుని ఉన్న సమయం. నిజానికి నేనొక పురుషాధిపత్య స్వభావం కలిగిన ఒక మహిళను చూడబోతున్నాననే  అనుకున్నాను. కానీ ఆమె సొగసుగా, స్నిగ్ధంగా ఉన్నారు. ఆమెలో నాకు అత్యంత స్పష్టంగా గుర్తున్నవి ఆమె చేతులు. అవి సన్నగా, కోమలమైన ఆకృతిని కలిగి ఉన్నాయి. ఒక నియంతలో అవి నేను ఊహించనివి. అప్పటికి నాలుగేళ్ల క్రితం ‘ది ఎకనమిస్ట్‌’ ఆమెను భారత సామ్రాజ్ఞి అని అభివర్ణించింది. ఆమె మణికట్టుకు మగవారి చేతివాచీ ఉన్నప్పటికీ ఒక రాకుమారిలోని సౌకుమార్యం ఆమెలో ఉట్టిపడుతూ ఉంది. 

అయినప్పటికీ ఆమె అతి సామాన్యంగా ఉండేవారు. ఎమర్జెన్సీ సమయంలో ఒక ఆదివారం నేను, మా అక్కచెల్లెళ్లు... గాంధీలతో కలిసి రాష్ట్రపతి భవన్‌లో ‘ద పింక్‌ పాంథర్‌’ను చూసేందుకు వెళ్లడానికి ముందు అంతా కూర్చొని అల్పాహారం తీసుకుంటూ, పూర్తిగా మాటల్లో మునిగిపోయాం. శ్రీమతి గాంధీ ఒక్క ఉదుటన ‘‘పదండి, పదండి...’’ అనేంత వరకు కూడా సమయం మించిపోతున్నట్లు మేము గమనించనే లేదు. ‘‘ఇప్పటికే మనం లేట్‌ అయ్యాం. ఎవరైనా ఒకటికి వెళ్లాలనుకుంటే ఇప్పుడే వెళ్లిరండి’’ అని కూడా ఆమె అన్నారు.

అప్పుడు మా ప్రమీలక్క, ‘‘ప్రచారంలో ఉండగా ఒకటికి వెళ్ల వలసి వచ్చినప్పుడు మీరేం చేశారు?’’ అని శ్రీమతి గాంధీని అడి గారు. మా మాటకు ఆమె... ‘‘రాత్రి పడుకునే ముందు చివరిగా నేను చేసే పని కడుపునిండా నీళ్లు తాగడం. దాంతో ఉదయానికంతా నా సిస్టమ్‌ ఖాళీ అయిపోతుంది. తర్వాత ఒకటికి వెళ్లే అవసరమే
ఉండదు’’ అని చెబుతూ, ‘‘మగవాళ్లలా నేను చెట్టు వెనక్కు వెళ్లలేను కదా’’ అని నవ్వారు. 

ఏమైనా సీజర్‌ విషయంలో జరిగినట్లే, ఆమె మంచి అంతా ఆమె చితాభస్మంతో పాటుగా నీటిలో కలిసిపోయింది. మనం గుర్తు పెట్టుకున్నది చెత్తను మాత్రమే! నా జ్ఞాపకాలలో 1971 డిసెంబర్‌ 16 నాటి ఉత్తేజం నేటికింకా స్పష్టంగా ఉంది. ఇండో–పాక్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ను భారత్‌ ఓడించిందనీ, బంగ్లాదేశ్‌ ఆవిర్భవించిందనీ శ్రీమతి గాంధీ ప్రకటించిన రోజు అది.

ఆ తర్వాతి రోజో, లేక ఆ మర్నాడో ఆమె పీఎల్‌–480 ఆహార సహాయ ఒప్పందాన్ని నిష్కర్షగా తిరస్కరిస్తూ ప్రెసిడెంట్‌ నిక్సన్‌కు లేఖ రాసినప్పుడు అమెరికా పక్షపాత వైఖరికి దీటైన సమాధానం ఇచ్చారని నా పదహారేళ్ల వివే చనకు అనిపించింది. నాటి ఇండో–పాక్‌ యుద్ధంలో భారత్‌ ఘన విజయానికి కారకుడిగా ఈరోజున మనం శామ్‌ మానెక్‌షాను సరిగ్గానే కీర్తిస్తున్నాం కానీ, అందులో శ్రీమతి గాంధీ పాత్రను మాత్రం అన్యా యంగా తిరస్కరిస్తున్నాం. 

విదేశాలలో ఇందిరా గాంధీ నెలకొల్పిన భారతదేశ ప్రతిష్ఠను చూసి గర్వించిన తరం నాది. 1960ల మధ్యలో లిండన్‌ జాన్సన్‌ పక్కన చక్కటి దుస్తులలో, తీరుగా కత్తిరించిన ఒత్తయిన జుత్తుతో ఇందిరా గాంధీ నిలబడి ఉండగా ఫొటో తియ్యడం ఆ ఫొటోగ్రాఫర్‌ జన్మకు ధన్యత అనే చెప్పాలి. శ్వేతసౌధం పచ్చిక బయళ్లలో తీసిన ఆ ఫొటోల కంటే మెరుగ్గా మళ్లీ ఎవరైనా తియ్యడం అసాధ్యం అను కున్నాను.  

అయితే అది 1982లో లండన్‌లో జరిగిన ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభోత్సవంలో నేను ఆమెను చూసేంత వరకే! ఆ కార్యక్రమంలో మార్గరెట్‌ థాచర్‌తో కలిసి నడుస్తున్నప్పుడు ఇందిరా గాంధీ ఆహా ర్యాన్ని చూసి ప్రేక్షకులు హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. జామావర్‌ షాల్‌తో తయారైన అద్భుతమైన కోటును ధరించి ఉన్నారామె. ఆమెను అలా చూసి నా మనసు పాఠశాల రోజు లలో నేను చదువుకున్న ఎనోబార్బస్‌ వర్ణనను గుర్తు చేసింది. ‘‘వయసు ఆమెను వడలిపోనివ్వదు. సంప్రదాయం ఆమె అనంతమైన వైవిధ్యాన్ని నశించ నివ్వదు’’ అంటాడు ఎనోబార్బస్, క్లియో పాత్ర గురించి! 

1977లో ఇందిరా గాంధీ సార్వత్రిక ఎన్నికలను నిర్వహించడానికి కారణం ఏమిటి? బహుశా అది ఆమె గురించి ఎప్పటికీ విడివడని ముడి కావచ్చు. ఆ ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఏమీ లేకపోవచ్చు. కానీ వాటిని వాయిదా వేయగల సామర్థ్యం ఆమెకు లేకపోతే కదా! ఎన్నికలకు ఆమెను బలవంతం చేసే బయటి శక్తులు కూడా ఏమీ లేవు.

కాబట్టి ఆమె తన మనస్సాక్షి ప్రకారం ముందుకు వెళ్లారని అనుకోవాలా? లేక ఎమర్జెన్సీ విధించినందుకు ఆమెలో పశ్చాత్తాపం కలిగిందా? లేదంటే, ఎమర్జెన్సీ చాలా కాలం సాగిందన్న విషయాన్ని ఆమె అంగీకరించి ఉంటారా? వేర్వేరు వ్యక్తులు ఈ ప్రశ్నలకు భిన్నమైన సమాధానాలు ఇచ్చారు. వాటిల్లో ఒక్కటి కూడా సబబైన జవాబుగా అనిపించదు. 

నిజానికి ఇంకా లోతైన ప్రశ్న ఉంది. ఆ ఎన్నికలలో తను విజయం సాధించగలనని ఆమె భావించి ఉంటారా, లేదా తనొక ఘోర పరాజయం వైపు వెళుతున్నానన్న అవగాహనను ముందే కలిగే ఉన్నారా? జరగబోయేదేమిటో తెలిసి కూడా విధిని ఆమె స్వాగతించారా? అది తనకు తను విధించుకున్న శిక్షా? ఎమర్జెన్సీ అనే పాపానికి చేసుకున్న పరిహారమా?

ఇందిరా గాంధీ తర్వాత కూడా మనకు బలమైన పాలకులు వచ్చారు. చక్కటి వస్త్రధారణతో మనల్ని ముగ్ధుల్ని చేసిన అనేకమంది ప్రధానులూ ఉన్నారు. అందరిలోకి ఇందిరా గాంధీ ఒక్కరే ప్రత్యేకమైన వారిగా ఎందుకు నిలిచారు? బహుశా అలా అనిపించడం యవ్వనంలోని జ్ఞాపకాలు జమ చేసుకుని ఉంచుకున్న అవ్యక్త గతానుభూతులు ప్రతిధ్వనించడం వల్లనా? మనోవైజ్ఞానిక నిపుణులు, తత్త్వవేత్తలు దీనికి మెరుగైన వివరణ ఇవ్వగలరనుకుంటాను. నేను చెప్పగలిగింది మాత్రం ఒక్కటే – అలాగని ఏదో చెప్పాలని చెప్పడం కాదు – నేను ఏమనుకుంటానంటే ఆమెలో ఏదో లేకుండానైతే లేదని!
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు