‘రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ఎన్‌జేఏసీ!’

29 Apr, 2015 01:54 IST|Sakshi

న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం ఏర్పాటు రాజ్యాంగం మౌలిక సూత్రాలను ఉల్లంఘించిందని వివిధ న్యాయసంఘాలు సుప్రీం కోర్టుకు విన్నవించాయి. ఎన్‌జేఏసీ ప్యానెల్‌లో ఇద్దరు సభ్యులను ఎన్నుకోవటానికి ఏర్పాటు చేసిన సమావేశానికి తాను హాజరు కావటం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు ప్రధాని మోదీకి లేఖ రాసిన మర్నాడే న్యాయసంఘాలు ఈ అంశాన్ని సుప్రీం దృష్టికి తీసుకువచ్చాయి.


న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌జేఏసీ నిలబడేది కాదని, సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్ వాదించారు. సుప్రీం కోర్ట్ అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్‌సీఏఓఆర్‌ఏ) తరపున ఆయన అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు హాజరయ్యారు. ఎన్‌జేఏసీ చట్టాన్ని సవాలు చేసిన న్యాయ సంఘాల్లో ఇది ఒకటి. న్యాయవ్యవస్థ సర్వస్వతంత్రత రాజ్యాంగ మౌలిక సూత్రమని, ఈ సూత్రాన్నే ఎన్‌జేఏసీ ఉల్లంఘిస్తోందనీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయాలకు సైతం ఈ చట్టం తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వటం లేదని నారిమన్ అన్నారు.

మరిన్ని వార్తలు