Sakshi News home page

వివాహాలకు అడ్డంకిగా ఎన్నికల నియమావళి

Published Thu, Nov 9 2023 1:42 AM

- - Sakshi

ఫంక్షన్‌ హాళ్లను వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచార వేదికలుగా మార్చుకుంటుండటంతో పెళ్లిళ్ల నిర్వహణ ప్రధాన సమస్యగా మారనుంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో భాగంగా, అలాగే ప్రచారంలో పాల్గొనే కార్యకర్తలకు భోజనాలు, రాత్రి పూట బసకు వీటిని ముందే బుక్‌ చేసుకుంటున్నారు. టెంట్లు, వంట సామగ్రి కూడా పెళ్లిళ్లకు దొరికే పరిస్థితి లేదు.

తిరుమలగిరి (తుంగతుర్తి): ఎన్నికల కోడ్‌.. శుభకార్యాలు చేసే వారికి కష్టాలను తెచ్చి పెట్టింది. దీని ప్రభావం ప్రధానంగా పెళ్లిళ్లపై పడుతోంది. నవంబర్‌ 16వ తేదీ నుంచి వరుసగా శుభ ముహూర్తాలు ఉన్నాయి. వివాహాలకు అన్నీ సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పెళ్లింటివారు దుస్తులు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలుకు, నగదు లావాదేవీలు చెల్లింపులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చెక్‌పోస్టుల వద్ద పట్టుకుంటుండడంతో..
ఎన్నికల నేపథ్యంలో కోడ్‌ అమల్లో ఉండడంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. రూ.50 వేలకు మించి డబ్బు తీసుకెళ్తే సీజ్‌ చేస్తున్నారు. సాధారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలకు లిక్విడ్‌ క్యాష్‌ అవసరం ఉంటుంది. ఫంక్షన్‌ హాల్‌ బుక్‌ చేయడం, వంట వాళ్లకు, టెంట్లకు, దుస్తులు, బంగారం కొనుగోళ్లు వంటి వాటికి నగదు అవసరం. ఎంత లేదన్నా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. బంగారం సైతం కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. అయితే.. డబ్బు తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు పట్టుబడుతున్నారు. శుభకార్యాల కోసం తీసుకెళ్తున్నామని ఆధారాలు చూపించినా పోలీసులు వినిపించుకోవడం లేదు. డబ్బు పట్టుబడితే దాన్ని విడిపించుకోవడం కోసం పోలీస్‌ స్టేషన్‌, ఎన్నికల అధికారుల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.

డిజిటల్‌ చెల్లింపుల పైనా ఆంక్షలు
డిజిటల్‌ లావాదేవీలైనా జరుపుదామనుకున్నా సాధ్యం కావడం లేదు. లక్షకు మించి డిజిటల్‌ లావాదేవీలు జరిపినా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికే వస్తుందని, వాటిపై కూడా ఎన్నికల అధికారులు, పోలీసులు డేగ కన్ను వేశారు. ఏ మాత్రం తేడా వచ్చినా నోటీసులు ఇచ్చి సంజాయిషీలు అడుగుతున్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందికి వస్తే కేసులు నమోదు చేస్తున్నారు.

వాహనాలు లేవు..
పెళ్లిళ్లలో అతిథులను తీసుకెళ్లడానికి వాహనాలు అవసరం. సొంత వాహనాలు ఉన్న వారికి పెద్ద సమస్య ఉండక పోవచ్చు. కానీ అవి లేని వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. పెళ్లి కోసం కార్లు, బస్సులు దొరకడం లేదు. ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయిన మరుసటి రోజే అభ్యర్థులు వీటిని బుక్‌ చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో వాడుకోవడానికి ఒక్కో అభ్యర్థి అధికారికంగా మూడు, నాలుగు, అనధికారికంగా 10, 15 వాహనాలను బుక్‌ చేసుకున్నారు. దీంతో పెళ్లిళ్లకు వాహనాలు దొరకని పరిస్థితి ఏర్పడింది.

Advertisement

What’s your opinion

Advertisement