సాక్షి మహరాజ్ సంచలన వ్యాఖ్యలు

14 Apr, 2015 02:29 IST|Sakshi
సాక్షి మహరాజ్

 ఉన్నావ్(యూపీ): వివాదాస్పద వ్యాఖ్యలకు మారుపేరైన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ మరోసారి తన మార్కు ప్రకటన చేశారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలంటే అందరూ కుటుంబ నియంత్రణ పాటించాలని, అలా పాటించని వారికి ఓటుహక్కును రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. హిందువుల మాదిరే ముస్లింలు కూడా కుటుంబ నియంత్రణ పాటించాలని, అందరికీ ఒకే చట్టం ఉండాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  ''నేను ముస్లింలు, క్రిస్టియన్లు తప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలనడం లేదు. జనాభా పెరుగుదలను అడ్డుకోవాలంటే  దీనిని పాటించాల్సిందే. హిందువులు కుటుంబ నియంత్రణ పాటిస్తున్నట్టే ముస్లింలు కూడా పాటించాలి. హిందువులు నలుగురు పిల్లల్ని కనాలంటే ఎంతో గొడవ చేశారు. అదే కొందరు నలుగురు భార్యల ద్వారా 40 మంది పిల్లల్ని కంటుంటే ఎవరూ ఏమీ అనరు''అని అన్నారు.

జనాభా పెరుగుదల దేశం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యల్లో ఒకటని పేర్కొన్నారు. ''దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మన జనాభా 30 కోట్లు. ఇప్పుడు 130 కోట్లు. దీనికి ఎవరు బాధ్యులు? హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు.. .. ఎవరైనా కానీ అందరికీ ఒకే చట్టం ఉండాలి. ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు.. ఎందరు పిల్లలైనా సమాజంలోని అన్ని వర్గాలకు ఒకే చట్టం ఉండేలా చూడాలి. అందరికీ వర్తించేలా ఉమ్మడి చట్టం తేకుంటే దేశానికే నష్టం. ఇందుకు ప్రభుత్వం, ప్రతిపక్షం ముందుకు రావాలి. ఈ చట్టాన్ని పాటించనివారి ఓటు హక్కును రద్దు చేయాలి'' అని పేర్కొన్నారు. వర్గాలను బట్టి మహిళల పట్ల వివక్ష పాటించడం తగదన్నారు. గాంధీని చంపిన గాడ్సే దేశభక్తుడని గతంలో సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించి, తర్వాత పార్లమెంట్‌లో క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు