జీఎస్టీపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

4 Jan, 2017 00:55 IST|Sakshi

న్యూఢిల్లీ: మంగళవారం ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్‌ ఎనిమిదో భేటీలో పలు అంశాలపై ప్రతిష్టంభన నెలకొంది. తీర ప్రాంతం నుంచి 12 నాటికల్‌ మైళ్ల వరకూ సముద్రం మధ్యలో అమ్మకాలపై పన్ను హక్కు తమకే చెందాలంటూ పలు రాష్ట్రాలు డిమాండ్‌ చేశాయి. రాష్ట్రాలకు చెల్లించే పరిహార నిధిని రూ. 90 వేల కోట్లకు పెంచాలన్న డిమాండ్‌ నేపథ్యంలో కీలక అంశాలపై చర్చ ముందుకు సాగలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన రెండ్రోజులు జరిగే భేటీలో మంగళవారం ఐజీఎస్టీ(ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ)లోని పలు నిబంధనలపై అంగీకారం కుదిరింది. ముఖ్యమైన ఉమ్మడి నియంత్రణ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదు. 

ఐజీఎస్టీ చట్టంలో రాష్ట్రాలకు సంబంధించిన నిబంధనలో తీరం నుంచి 12 నాటికల్‌ మైళ్లుగా పేర్కొనాలంటూ పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు డిమాండ్‌ చేశాయి. ఇది చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందా? లేదా? అన్న దానిపై న్యాయ శాఖ అభిప్రాయాన్ని తీసుకుంటామని జైట్లీ హామీనివ్వడంతో చర్చ ముందుకు సాగింది. అలాగే పరిహార నిధి కోసం సెస్సు విధించే వస్తువుల సంఖ్య పెంచాలని పలు రాష్ట్రాలు కోరాయి.

మరిన్ని వార్తలు