‘2019లోనూ మేమే.. ఆశ పెట్టుకోవద్దు..’

12 Mar, 2017 11:21 IST|Sakshi
‘2019లోనూ మేమే.. ఆశ పెట్టుకోవద్దు..’

గోరఖ్‌పూర్‌: ఇక ప్రతిపక్షాలు తమ వ్యూహాలను 2024కు సిద్ధం చేసుకోవాల్సిందేనని బీజేపీ పార్టీ ఫైర్‌బ్రాండ్‌ నేత యోగీ ఆదిత్యానాధ్‌ అన్నారు. వచ్చే 2019 ఎన్నికలపై ప్రతిపక్ష పార్టీలు ఇక ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో భారీ విజయాన్ని బీజేపీ సాధించిన విషయం తెలిసిందే. గోవా, మణిపూర్‌లో హంగ్‌ పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో అక్కడ కూడా అధికారం చేపడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు.

ఈ విజయం నేపథ్యంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఒమర్‌ అబ్దుల్లా మాట్లాడుతూ బీజేపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చేందుకు, ప్రత్యామ్నాయ ఎజెండా తీసుకొచ్చేందుకు మరో వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిపై వెంటనే స్పందించిన యోగీ ఆదిత్యానాథ్‌ ‘అమిత్‌షా వ్యూహంతోపాటు కేంద్రం అనుసరిస్తున్న విధానాల ద్వారానే మాకు ఇంత పెద్ద విజయం దక్కింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ మాత్రమే గొప్ప నాయకుడిగా ఎదిగారు.

2019 ఎన్నికలను పక్కకు పెట్టి ఇక ప్రతిపక్షాలు 2024 ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సిందే’  అని చురకలంటించారు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారని బీఎస్పీ అధినేత్రి మాయావతి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈవీఎంల నిర్వహణను చూసింది సమాజ్‌వాది పార్టీ ప్రభుత్వమేనని, అలాంటి ఆపార్టీకి అనుకూలంగా ఈవీఎంలను మార్చుకునే అవకాశం ఉంటుందేగానీ తమకు ఎలా అవకాశం ఉంటుందని అన్నారు. ఈ ఆరోపణలన్నీ మానుకోని వారి వ్యూహాలు 2024కు పదును పెట్టుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు