బెంగళూరులో పదుల సంఖ్యలో స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు

1 Dec, 2023 15:28 IST|Sakshi

బెంగళూరు: బెంగళూరులో బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌ కలకలం సృష్టించింది. సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు మొయిల్స్‌ రావడంతో విద్యార్థులు, స్కూల్స్‌ యాజమాన్యం వణికిపోయింది. దీంతో, ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా  విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు.

వివరాల ప్రకారం.. కర్ణాటక రాజధాని బెంగళూరులోని పలు పాఠశాలలకు శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. గుర్తుతెలియని ఒక ఈ మెయిల్ నుంచి ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా  విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలను నుంచి బయటకు పంపించారు. తర్వాత బాంబ్‌స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టాయి. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. కాగా, బెదిరింపులపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది నకిలీ బెదిరింపు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

అయితే, శుక్రవారం మధ్యాహ్నం కర్ణాటకలోని సుమారు 15 పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. తొలుత ఏడు స్కూళ్లకు ఈ బెదిరింపు మెయిళ్లు రాగా.. ఆ తర్వాత కొద్దిసేపటికే మరికొన్ని విద్యాసంస్థలకు అదే తరహా ఈ మెయిళ్లు వచ్చాయి. దీంతో, అప్రమత్తమైన స్కూల్స్‌ యాజమాన్యం.. విద్యార్థుల పేరెంట్స్‌కు సమాచారం అందించారు. ‘ఈ రోజు మన పాఠశాల అనూహ్య పరిస్థితిని ఎదుర్కొంది. గుర్తుతెలియని వర్గాల నుంచి ఒక ఈ మెయిల్ వచ్చింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, వెంటనే వారిని బయటకు పంపించాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. 

మరోవైపు.. బాంబు బెదిరింపు మెయిల్‌ వచ్చిన పాఠశాల్లలో ఒక్క స్కూల్‌.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసానికి అతి సమీపంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, వైట్‌ఫీల్డ్, కొరెమంగళ, బసవేశ్వరనగర్‌, యెళహంక, సదాశివనగర్‌లోని పాఠశాలలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఇదిలా ఉండగా.. గత ఏడాది కూడా బెంగళూరులోని ఏడు పాఠశాలలకు ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, తర్వాత అది నకిలీ బెదిరింపు అని తేలింది.

ఇదీ చదవండి: తమిళనాడులో భారీ వర్షాలు .. ఐఎమ్‌డీ హెచ్చరిక

మరిన్ని వార్తలు