రాజ్యసభలో రగడ

20 Aug, 2013 01:56 IST|Sakshi
రాజ్యసభలో రగడ

న్యూఢిల్లీ: ఉల్లి ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్ష సభ్యులు, ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు గలభా సృష్టించడంతో సోమవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. మాజీ సభ్యులు దిలీప్‌సింగ్ జుదేవ్ (బీజేపీ), ఎస్.ఎం.లాల్‌జాన్ భాషా (టీడీపీ)ల మృతికి, సబ్‌మెరీన్ ప్రమాదంలో నౌకాదళ సిబ్బంది మరణానికి సభ సంతాపం వ్యక్తం చేస్తున్నట్టుగా చైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించిన వెంటనే బీజేపీ, ఎస్పీ, వామపక్ష పార్టీల సభ్యులు లేచి నిలబడ్డారు. అయితే బీజేపీ సభ్యుడు వెంకయ్యనాయుడు మాట్లాడేందుకు చైర్మన్ అనుమతించారు. బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించిన ఫైళ్లు గల్లంతు కావడం తీవ్రమైన అంశమని వెంకయ్యనాయుడు అన్నారు. జీరో అవర్‌లో ఈ విషయం ప్రస్తావించాల్సిందిగా అన్సారీ ఆయనకు సూచించారు.
 
 బీజేపీ సభ్యులు కూర్చోగానే ఎస్పీ సభ్యులు ఉత్తరప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. పెరుగుతున్న ఉల్లి ధరలను అదుపు చేయాలంటూ వామపక్ష ఎంపీలు పోస్టర్లు ప్రదర్శించారు. సభ్యులు సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తి చేసిన చైర్మన్.. ఫలితం లేకపోవడంతో తొలిసారి 15 నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాతా ఎస్పీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో రెండోసారి మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.
 
 ప్రధానిని కాపాడే కుట్ర: బొగ్గు శాఖకు చెందిన కీలక ఫైళ్లు మాయం కావడంపై రాజ్యసభ జీరో అవర్ విపక్షాల అరుపులతో దద్దరిల్లింది.  బొగ్గు స్కాం నుంచి ప్రధానిని రక్షించేందుకు కుట్ర జరుగుతోందని విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై ప్రధాని జవాబు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. బీజేపీ ఎంపీ  దిలీప్ సింగ్ జుదేవ్ మృతికి సంతాపం ప్రకటించాక లోక్‌సభ మంగళవారానికి వాయిదా వేశారు.
 
 వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
 వక్ఫ్ ఆస్తుల దురాక్రమణలను అరికట్టడంతో పాటు వాటి లీజును గరిష్టంగా ముప్పయ్యేళ్ల వరకు పొడిగించేందుకు  వక్ఫ్ సవరణ బిల్లును సోమవారం రాజ్యసభ ఆమోదించింది. వక్ఫ్ సవరణ బిల్లు-2010 ద్వారా వక్ఫ్ ఆస్తులు వాణిజ్యపరంగా సక్రమంగా వినియోగించేందుకు వీలవుతుందని, వాటిపై ఏటా రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం లభిస్తుందని మైనారిటీ వ్యవహారాల మంత్రి రెహమాన్ ఖాన్ చెప్పారు.

 నిరాటంకంగా ప్రశ్నోత్తరాలు: సభా కార్యకలాపాలకు  పదేపదే  అంతరాయాల నేపథ్యంలో అన్సారీ సోమవారం అఖిలపక్ష నేతలతో సమావేశమయ్యారు. వర్షాకాల సమావేశాల్లో ఇకపై శాసన పరమైన సభా వ్యవహారాలకు అంతరాయం కలిగించబోమని  సభ్యులు హామీ ఇచ్చారు. ప్రశ్నోత్తరాలు నిరాటంకంగా కొనసాగేందుకు సహకరిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు