రాజ్యసభ ఛైర్మన్‌కు క్షమాపణలు చెప్పండి: ఆప్ ఎంపీకి సుప్రీంకోర్టు ఆదేశం

3 Nov, 2023 16:21 IST|Sakshi

న్యూఢిల్లీ: రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌కు క్షమాపణ చెప్పాలని సుప్రీంకోర్టు ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్‌ ఛద్దాకు స్పష్టం చేసింది. రాజ్యసభ నుంచి తనను సస్పెండ్‌ చేస్తూ ఛైర్మన్‌ తీసుకన్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఛద్దా సుప్రీంకోర్టుకు ఎక్కిన విషయం తెలిసిందే. ఈ విషయమై శుక్రవారం చీఫ్‌  జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ విచారణ జరిపి తీర్పునిచ్చింది. ఛద్దా క్షమాపణలను రాజ్యసభ ఛైర్మన్‌ కూడా సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు బెంచ్‌ సూచించింది. సస్పెన్షన్‌ కేసులో ఛద్దా నేరుగా ఛైర్మన్‌ను కలిసి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. 

 సీజేఐ డీవీ చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ శుక్రవారం తీర్పునిస్తూ.... రాజ్యసభ చైర్మన్‌ అయిన జగ్‌దీప్‌ ధన్‌కర్‌.. చద్దా క్షమాపణలను సానుభూతితో పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.  అలాగే ఈ కేసులో ముందుకు వెళ్లే మార్గాన్ని సృష్టించేందుకు ప్రయత్నించాలని సూచించారు. అయితే ఆప్‌ ఎంపీ అయిన రాఘవ్‌ చద్దా తొలిసారి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఆయన అత్యంత పిన్న వయస్కుడన్న  విషయాన్ని ప్రస్తావించారు. 

కోర్టు ఆదేశాలపై చద్దా తరపు న్యాయవాది షాదన్ ఫరాసాత్‌ స్పందిస్తూ.. రాజ్యసభ చైర్మన్‌ను క్షమాపణలు కోరడంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. చైర్మన్‌కు కలిసి క్షమాపణలు కోరేందుకు చద్దా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆప్‌ ఎంపీ క్షమాపణలు చెప్పడం సరైనదేనని కేంద్రం తరపున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా అంగీకరించారు. అనంతరం ఈ కేసులో పురోగతిని నవంబర్‌ 20న తెలియజేయలన్న సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. 
చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా

కాగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ సీనియర్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై నియంత్రణ కోసం ఉద్దేశించిన ‘గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ ఢిల్లీ(అమెండ్‌మెంట్‌) బిల్లు–2023’ పరిశీలించేందుకు ప్రతిపాదిత సెలక్ట్ కమిటీకి  అనుమతి తీసుకోకుండానే అయిదుగురు సభ్యుల పేర్లను చేర్చారన్న ఆరోపణలపై గత వర్షాకాల సమావేశాల్లో రాఘవ్ చద్దాను ఆగస్టు 11న రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి, నివేదిక ఇచ్చే వరకు సస్పెన్షన్‌ కొనసాగుతుందని రాజ్యసభ తెలిపింది. 

 రాఘవ్ చద్దాను సస్పెండ్ చేయాలంటూ పీయూష్ గోయెల్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. నిబంధనల ఉల్లంఘన, అనుచిత ప్రవర్తన, ధిక్కార వైఖరి ఆరోపణలపై ఆయనపై సస్పెన్స్ వేటు పడింది. దీనిపై సభా హక్కుల కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చేంత వరకూ సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. దీనిపై రాఘవ్ చద్దా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు