ఆహార బిల్లుపై నేడు లోక్‌సభలో చర్చ! | Sakshi
Sakshi News home page

ఆహార బిల్లుపై నేడు లోక్‌సభలో చర్చ!

Published Tue, Aug 20 2013 1:47 AM

ఆహార బిల్లుపై నేడు లోక్‌సభలో చర్చ! - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రచారాస్త్రంగా పరిగణిస్తున్న ఆహార భద్రత బిల్లుకు రాజీవ్‌గాంధీ జయంతి అయిన మంగళవారం (ఆగస్టు 20) నాడే లోక్‌సభ ఆమోదాన్ని పొందాలని పట్టుదలతో ఉన్న పాలకపక్షం ఆ దిశగా అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. యూపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లుకు అన్ని పార్టీల మద్దతును కూడా కూడగట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా.. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణల్లో కొన్నింటిని ఆమోదించాలని నిర్ణయించింది.
 
 అలాగే.. బిల్లుకు మద్దతివ్వాలంటూ కాంగ్రెస్ నేతల బృందం సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌యాదవ్‌ను కలిసి కోరింది. మరోవైపు లోక్‌సభలో బిల్లు ఆమోదానికి ఎలాంటి ఆటంకాలూ లేకుండా చేసేందుకు గాను.. ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్న ఎంపీలను అవసరమైతే బయటకు పంపాలని కూడా సర్కారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మంగళవారం లోక్‌సభ సమావేశం కాగానే.. ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేసి నేరుగా ఆహార భద్రత బిల్లును పరిశీలనకు చేపట్టాలని నిర్ణయించారు. సోమవారం సభ వాయిదా అనంతరం స్పీకర్ మీరాకుమార్ నిర్వహించిన రాజకీయ పక్షాల నేతల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
 ఆచరణసాధ్యమైన సవరణలకు ఓకే: కమల్‌నాథ్
 ఆహార భద్రత బిల్లుకు వివిధ పక్షాలు సూచించిన సవరణల్లో ఆచరణసాధ్యమైన సవరణలన్నింటినీ ప్రభుత్వం ఆమోదిస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ వెల్లడించారు. ఆహార భద్రత చట్టం, అమలుకు సంబంధించిన వివిధ శాఖల మంత్రులతో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ సోమవారం పార్లమెంటులో సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. ఆహార బిల్లుకు ప్రతిపక్షాల నుంచి వచ్చిన దాదాపు 200కు పైగా సవరణల గురించి ప్రస్తావించగా.. వాటిలో ఆచ
 రణ సాధ్యమైన సవరణలను తాము పరిశీలిస్తున్నామని, వాటిని అధికారిక సవరణగా తెస్తామని తెలిపారు.
 
  ‘బిల్లును ఆమోదం కోసం మంగళవారం నాడే లోక్‌సభలో ప్రవేశపెడతారా?’ అని ప్రశ్నించగా.. అది న్యాయశాఖపై ఆధారపడి ఉంటుందని, సవరణలను న్యాయశాఖ ఆమోదించాల్సి ఉందని ఆయన బదులిచ్చారు. తెలంగాణ అంశంపై లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తున్న టీడీపీ ఎంపీల విషయంలో ఏం చేయాలనే అంశంపై స్పీకర్ మీరాకుమార్ మంగళవారం ఉదయం ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రధాని నిర్వహించిన సమావేశంలో ఆహారశాఖ మంత్రి కె.వి.థామస్, మహిళా, శిశు అభివద్ధి శాఖ మంత్రి కష్ణతీర్థ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి జైరాంరమేశ్, మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు, ఆర్థికమంత్రి పి.చిదంబరం పాల్గొన్నారు. ఆహార భద్రత బిల్లుతో పాటు, భూసేకరణ బిల్లు కూడా మంగళవారం నాడు లోక్‌సభ పరిశీలనకు వచ్చే అంశాల జాబితాలో ఉన్నాయి. మరోవైపు.. రాజీవ్‌గాంధీ జయంతి రోజైన మంగళవారం నాడు ఆహార భద్రత బిల్లుకు ఆమోదం పొందుతామా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఏఐసీసీ ప్రతినిధి రాజ్‌బబ్బర్ అన్నారు.  
 
 ములాయం మద్దతు కోరిన కాంగ్రెస్
 ఆహార బిల్లు ఆమోదానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ  ఆహార  మంత్రి కె.వి.థామస్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌లు సోమవారం సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయంసింగ్‌ను కలిశారు. ప్రధాని నేతృత్వంలో నిర్వహించిన సమావేశం తర్వాత వీరు ముగ్గురూ ములాయంను కలిశారు. దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు మంగళవారం ఎస్‌పీ పార్లమెంటరీ పార్టీ సమావేశమవుతుందని ఆ పార్టీ నేత రామ్‌గోపాల్‌యాదవ్ పేర్కొన్నారు. యూపీఏ సర్కారుకు వెలుపలి నుంచి మద్దతు ఇస్తున్న ఎస్‌పీ.. రైతుల ప్రయోజనాలను కాపాడతామని, వారి ఉత్పత్తులపై వారికి లాభం లభిస్తుందని ప్రభుత్వం హామీ ఇస్తే ఆహార భద్రత బిల్లుకు తాము మద్దతు ఇస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement