ముంబై ఐఐటీలో 'క్యాట్' వాక్

28 Jul, 2014 13:19 IST|Sakshi
ముంబై ఐఐటీలో 'క్యాట్' వాక్

కష్టమైన ఎంట్రెన్స్ టెస్టులేవీ పాసవ్వకుండానే ఏకంగా ప్రతిష్ఠాత్మక ముంబై ఐఐటీలో అడుగుపెట్టి.. గుబులు రేపిందో  ఓ చిరుత పులి. అక్కడివారిని గడగడలాడించిన అనుకోని అతిథి ఎట్టకేలకు తనంతట తానే వీడ్కోలు తీసుకుంది. నాలుగు రోజుల క్యాంపస్ విహరం అనంతరం తిరిగి అటవీ ప్రాంతానికి వెళ్లిపోయింది. దీంతో ఈ నాలుగు రోజులూ బిక్కుబిక్కుమంటూ గడిపిన ఐఐటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేనేజ్‌మెంట్ ఊపిరి తీసుకున్నారు.

ఇక వివరాల్లోకి వెళ్తే అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఓ చిరుత గత బుధవారం జనారణ్యంలోకి వచ్చింది. అక్కడా ఇక్కడా కాకుండా... ఏకంగా ఐఐటీ క్యాంపస్‌లోకి అడుగుపెట్టింది. ఆహారం కోసం ఓ కుక్కను వేటాడుతూ సమీప అడవిలో నుంచి నేరుగా క్యాంపస్ ప్రాంగణంలోకి వచ్చేసింది. వచ్చిన అతిథిని  చూసి క్యాంపస్ అంతా కలకలం రేగింది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్న చందంగా భయంతో క్యాంపస్ లోని వారంతాప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు.

చిరుతను పట్టుకోవడానికి సంజయ్‌గాంధీ జాతీయ పార్కు, థానె అటవీ అధికారులను రంగంలోకి దింపారు. దాన్ని పట్టుకునేందుకు అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించినా చిరుత దగ్గర ఆ పప్పులేమీ ఉడకలేదు. వారికి చిరుత ఆనవాళ్లు కూడా చిక్కలేదు. దాని కాలి గుర్తులు, అది తిరిగిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకపోయింది.

550 ఎకరాల విస్తారమైన ఐఐటీ క్యాంపస్‌లో దాదాపు నాలుగు రోజులపాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించి, దాగుడుమూతలు ఆడిన చిరుత ఎట్టకేలకు విన్న పాఠాలు చాలనుకుందేమో తన ఆవాసానికి వెళ్లిపోయింది. క్యాంపస్ మొత్తం అంజనం వేసి గాలించినా.. చిరుతపులి కనిపించకపోవడంతో అది అడవిలోకి వెళ్లిపోయిందని నిర్ధారణకు వచ్చిన అటవీశాఖ అధికారులు గాలింపును నిలిపివేసి బచ్ గయా అనుకున్నారు. మరోవైపు ఎలాంటి ఎంట్రెన్స్‌లు రాయకుండానే..‘క్యాట్’ పాసవ్వకుండానే ఐఐటీలో అడుగుపెట్టిన ‘క్యాట్’ (చిరుత)దేమీ భాగ్యమోనంటూ ట్విట్టర్‌లో హాస్యోక్తులు పేలాయి.


 

మరిన్ని వార్తలు