పాక్ నరకం కాదు

24 Aug, 2016 06:58 IST|Sakshi
పాక్ నరకం కాదు

నటి, మాజీ ఎంపీ రమ్య వివాదాస్పద వ్యాఖ్యలు
- దేశద్రోహం కేసు పెట్టాలంటూ కర్ణాటక కోర్టులో పిటిషన్
- నా మాటకు కట్టుబడి ఉన్నా, క్షమాపణ చెప్పను: రమ్య
 
 సాక్షి, బెంగళూరు : పాకిస్తాన్‌ను, ఆ దేశ ప్రజల్ని పొగుడుతూ కన్నడ నటి, కాంగ్రెస్ మాజీ ఎంపీ రమ్య(33) చేసిన వ్యాఖ్యలు మంగళవారం తీవ్ర దుమారాన్ని లేపాయి. ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ కర్ణాటక కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదంటూ రమ్య తేల్చి చెప్పడంతో వివాదం మరింత ముదిరింది. రమ్య వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా దేశ వ్యాప్తంగా బీజేపీ, ఏబీవీపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సార్క్ దేశాల యువ చట్టసభ్యుల బృందం ఇటీవల ఇస్లామాబాద్‌లో పర్యటించింది. ఆ బృందంలో సభ్యురాలిగా ఉన్న రమ్య భారత్‌కు తిరిగొచ్చాక కర్ణాటకలోని మాండ్యాలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్తాన్ నరకం కాదు. అక్కడి ప్రజలు మనలాంటి వారే. వారు మమ్మల్ని బాగా చూసుకున్నారు’ అనడం వివాదానికి కేంద్ర బిందువైంది.  

 పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు
 ఆమె వ్యాఖ్యల్ని తప్పుపడుతూ కర్నాటకలోని  సోమవార్‌పేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలైంది. భారతీయ దేశభక్తుల్ని అవమానించినందుకు దేశద్రోహం, ఇతర ఆరోపణలపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాది విట్టల గౌడ కోరారు. పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణను ఆగస్టు 27కు వాయిదా వేసింది.

 పాకిస్తాన్‌నే కాదు సార్క్ దేశాల్ని ప్రేమిస్తా: రమ్య
 ‘పాక్‌నే కాదు.. బంగ్లా, శ్రీలంకతో పాటు సార్క్ దేశాలన్నింటినీ ప్రేమిస్తా. అవకాశమొస్తే ప్రపంచం చుట్టొచ్చేందుకు సిద్ధం. వ్యతిరేకతలు, శాంతిపై మాట్లాడడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం. స్వేచ్ఛను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో తప్పు. ఒక వ్యక్తిగా నా ఆలోచనలు, అభిప్రాయాలు, దృక్పథాల్ని చెప్పేందుకు అనుమతి ఉందని అనుకుంటున్నా, బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది.’ అన్నారు.

 ముందు మోదీపై కేసు పెట్టండి: కాంగ్రెస్
 పాకిస్తాన్‌తో మంచి సంబంధాల్ని కోరుకోవడం దేశద్రోహమైతే ముందు ప్రధాని మోదీపై కేసు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

మరిన్ని వార్తలు