ప్రభుత్వంపై దూకుడుగానే!

17 Jul, 2018 01:51 IST|Sakshi

పార్లమెంటు సమావేశాలపై విపక్షాల వ్యూహం

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభంకానుండటంతో ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలన్నీ సమావేశమై వ్యూహాలు రచిస్తుండగా.. ఉభయసభలు సజావుగా సాగేం దుకు సహకరించాలంటూ అధికార బీజేపీ విపక్షాలను కోరింది. ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతృత్వంలో సమావేశమైన విపక్ష పార్టీల నేతలు.. ఈ సమావేశాల్లో దూకుడుగా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని నిర్ణయించారు.

అటు, పార్లమెంటు వ్యవహారాల సహాయ మంత్రి విజయ్‌ గోయల్‌.. సోమవారం మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సహా ఎస్పీ, బీఎస్పీ, శివసేన, టీఆర్‌ఎస్, బీజేడీ, సీపీఐ తదితర పార్టీల నేతలను కలిసి దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సభా కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు సహకరించాలని కోరారు. జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభు త్వాన్ని ఇరుకున పెట్టేందుకు రాజ్యసభలో కాం గ్రెస్‌ పక్షనేత గులాంనబీ ఆజాద్‌ నేతృత్వంలో 12 విపక్ష పార్టీలకు చెందిన నేతలు రెండు దఫాలుగా సమావేశమయ్యారు. రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక విషయంలోనూ ఐకమత్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ప్రతిపక్షాల తరపున ఎవరిని బరిలో నిలిపినా తమ మద్దతుంటుందని కాంగ్రెస్‌ నేతలు ఆజాద్, మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు