సీబీఐ కోర్టును అభ్యర్థించిన పీటర్‌ ముఖర్జియా

28 Sep, 2019 11:02 IST|Sakshi

ముంబై: చనిపోయే లోపు తన పిల్లలతో మాట్లాడే అవకాశం కల్పించండి అంటూ ముంబై సీబీఐ కోర్టును వేడుకున్నారు మాజీ మీడియా టైకూన్‌ పీటర్‌ ముఖర్జియా.  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో పీటర్‌ ముఖర్జియా ప్రధాన నిందితుడనే సంగతి తెలిసిందే. విచారణ నిమిత్తం సీబీఐ కోర్టుకు హాజరైన పీటర్‌ ముఖర్జియా ‘నేను ఎంతకాలం జీవిస్తానో నాకు తెలియదు. నేను చనిపోయేలోపు విదేశాల్లో ఉన్న నా పిల్లలతో మాట్లాడాలనుకుంటున్నాను. అందుకు నాకు అనుమతివ్వండి’ అంటూ ముఖర్జియా న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఇందుకు జడ్జి సానుకులంగా స్పందిస్తూ.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని తెలిపారు.

షీనా బోరా హత్య కేసు..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ. 2012 ఏప్రిల్‌ 23న ఇంద్రాణి కుమార్తె షీనా బోరా హత్యకు గురి కాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె అవశేషాలను పోలీసులు గుర్తించారు. ఇంద్రాణి డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్‌గా మారి హత్యకేసు గుట్టు విప్పడంతో.. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేశారు. షీనా బోరాను అత్యంత పాశవికంగా  హతమార్చేందుకు జరిగిన  కుట్రలో ఆమె సవతి తండ్రి పీటర్‌ ముఖర్జియా పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన కొడుకు రాహుల్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నందుకే షీనాను హత్య చేయించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి.
(చదవండి: వాళ్లిద్దరినీ విడదీయడం కుదరక..)

మరిన్ని వార్తలు