కస్టమర్లకు అలర్ట్‌: దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న ఉద్యోగులు

17 Nov, 2023 15:00 IST|Sakshi

డిసెంబరు 4 నుంచి 11 వరకు  బ్యాంకుల వారీగా సమ్మె

న్యూఢిల్లీ: డిసెంబరు నెలలో దేశవ్యాప్త సమ్మెకు దేశంలోని పలు బ్యాంకులు సిద్ద మవు తున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది.  డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.  రెండు లక్షల ఉద్యోగాలను భర్తి , బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి స్వస్తి  అనే ప్రధాన డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి.   

ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ,  ప్రైవేట్ రంగ పలు బ్యాంకులు సమ్మెలో భాగం కానున్నాయి. డిసెంబర్ 4 -11 వరకు బ్యాంకుల వారీగా సమ్మె కొనసాగుతుంది. బ్యాంకుల్లో తగినంత శాశ్వత సిబ్బందిఉండేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. బ్యాంకు  ఉద్యోగాల అవుట్‌సోర్సింగ్ వల్ల దిగువ స్థాయిలో రిక్రూట్‌మెంట్‌ను తగ్గించడమే కాకుండా కస్టమర్ల గోప్యత , వారి డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం పేర్కొన్నారు.  సమ్మెలో పాల్గొనే  బ్యాంకుల వివరాలను ఆయన ట్విటర్‌లో షేర్‌ చేశారు.

డిసెంబరు 4న ఎస్బీఐ, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సమ్మె చేయనున్నాయి. అలాగే డిసెంబరు 5న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిసెంబరు 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెను పాటిస్తారు.అలాగే డిసెంబరు 7న యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, డిసెంబరు 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర,  డిసెంబరు 11న ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు.

మరిన్ని వార్తలు