లీ, అబేలతో మోదీ భేటీ

21 Nov, 2015 21:33 IST|Sakshi

కౌలాలంపూర్: మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ చైనా, జపాన్, మలేసియా సహా పలు దేశాధినేతలతో వరుస భేటీలు జరిపారు. ఆర్థిక పురోగతిలో మందగమనం, వాతావరణ మార్పులు, తీవ్రవాదంపై పోరాటం వంటి కీలక అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా ప్రధాని లీ కిక్వింగ్ తో చర్చించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ దానిని అధిగమించగలిగిందని లీ కిక్వింగ్ అన్నారు. త్వరలో పారిస్ లో జరగనున్న కాప్ దేశాల సదస్సుపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. సౌరశక్తి వంటి  సాంప్రదాయేతల ఇంధన వనరులపై భారత్ దృష్టిసారించిన దరిమిలా ఆమేరకు చైనా కూడా తోడ్పాటును అందించాలని మోదీ కోరగా, అందుకు లీ అంగీకరించారు.

భారత్ లో పెట్టుపడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని లీ తెలిపారు. మరికొన్ని ద్వైపాక్షిక అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక జపాన్ ప్రధాని షింజో అబే.. భారత ప్రధాని మోదీకి విందు ఇచ్చారు. శనివారం మధ్యాహ్నం వీరిద్దరూ కలిసి లంచ్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఇరుదేశాల అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమంటూ షింజో గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేసిన మోదీ.. ఇండియాలో పర్యటించాల్సిందిగా షింజోను ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు