వారి త్యాగాలకు సలాం

27 Nov, 2017 02:54 IST|Sakshi

ముంబై దాడిలో అమరులైన వారిని దేశం మరిచిపోదు

ఉగ్రవాదంపై సంఘటితంగా పోరాడాల్సిన తరుణమిదే

అందరూ రాజ్యాంగానికి కట్టుబడాల్సిందే

‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: 2008 ముంబై ఉగ్ర దాడుల్లో అమరులైన వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదని,  వారికి దేశం సలాం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచానికి ఉగ్రవాదం ముప్పుగా పరిణమించిన తరుణంలో దానిపై సంఘటితంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన ప్రసంగిస్తూ.. పౌరులు, పాలనా యంత్రాంగం రాజ్యాంగాన్ని అనుసరించి నడచుకోవాలని కోరారు. పద్మావతి చిత్రం  విడుదలను వ్యతిరేకిస్తూ కొందరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 
ఉగ్ర ముప్పు గురించి కొన్నేళ్ల క్రితం భారత్‌ మాట్లాడినప్పుడు.. ప్రపంచంలో చాలా దేశాలు అంతగా పట్టించుకోలేదని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘ప్రస్తుతం ఉగ్రవాదం వారి తలుపులు తడుతున్న సమయంలో.. ప్రపంచంలో మానవత్వం, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకమున్న ప్రభుత్వాలు ఈ సమస్యను అతిపెద్ద సవాలుగా చూస్తున్నాయి. ఉగ్రవాదం తన వికృత రూపంతో ప్రతి రోజు ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తోంది.

అందుకే భారతదేశమే కాకుండా.. ప్రపంచంలోని మానవతా శక్తులన్నీ ఉగ్రభూతాన్ని ఓడించేందుకు కలిసికట్టుగా పోరాటం చేయాలి.  నవంబర్‌ 26న మనం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు ముంబైలో జరిగిన ఉగ్రదాడిని దేశం మరచిపోదు. ఆ దాడిలో మరణించిన సాహస పౌరులు, పోలీసులు, భద్రతా సిబ్బంది, ఇతరుల త్యాగాలను ఈ దేశం గుర్తుంచుకుంటుంది. వారికి సలాం చేస్తోంది’ అని పేర్కొన్నారు.  

1 నుంచి సైనిక దళాలపై అవగాహన  
డిసెంబర్‌ 4న నేవీ దినోత్సవం నేపథ్యంలో యుద్ధం,ఇతర సమయాల్లో భారత నౌకాదళం పోషించిన పాత్రను ప్రధాని గుర్తు చేశారు. ‘కేవలం యుద్ధ సమయాల్లో మాత్రమే గాక.. సరిహద్దు దేశాల్లో మానవతా సాయం అందించడంలో భారత నేవీ కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోని చాలా నౌకా దళాల్లో ఎప్పటికోగానీ మహిళల్ని యుద్ధ నౌకల్లో చేర్చుకోలేదు. అయితే 800, 900 సంవత్సరాల క్రితమే భారత్‌లో చోళ రాజ్య సైన్యంలో మహిళలు కీలక పాత్ర పోషించారు. సైనిక దళాల పతాక దినోత్సవమైన డిసెంబర్‌ 7 గర్వించదగ్గ రోజు. డిసెంబర్‌ 1 నుంచి 7 వరకూ సైనిక బలగాల ప్రాధాన్యతను వివరిస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ వారమంతా సైనిక బలగాల శౌర్య పరాక్రమాలకు గుర్తుగా ప్రతి ఒక్కరూ జెండా ధరించాలి. ఆ ఫొటోల్ని # armedforcesflagday ట్వీటర్‌ ఖాతాకు పోస్టు చేయవచ్చు’ అని మోదీ విజ్ఞప్తి చేశారు.

రాజ్యాంగానికి కట్టుబడటం బాధ్యత
పౌరులు, పాలనా యంత్రాంగం...ఇరు వర్గాలూ రాజ్యాంగాన్ని అనుసరించి నడచుకోవాలని మోదీ కోరారు. ‘రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం మనందరి బాధ్యత. రాజ్యాంగం ప్రకారమే ప్రజలు, పాలకులు నడచుకోవాలి.  ఏ ఒక్కరికీ హాని జరగకూడదన్న సందేశాన్ని మన రాజ్యాంగం ఇస్తోంది.   సమానత్వం, సున్నితత్వం అనేవి రాజ్యాంగంలోని అద్వితీయ భావనలు. వాటి వల్లే ప్రతి ఒక్క పౌరుడికీ ప్రాథమిక హక్కులున్నాయి. ఆ హక్కులను రాజ్యాంగమే కాపాడి, ప్రజల ప్రయోజనాలకు రక్షణగా ఉంటుంది’ అని ప్రధాని వెల్లడించారు.  

2022 నాటికి యూరియా వాడకాన్ని తగ్గించాలి
డిసెంబర్‌ 5న ప్రపంచ మట్టి దినోత్సవాన్ని గుర్తు చేస్తూ.. ప్రపంచంలో సారవంతమైన భూమే లేకపోతే ఏం జరుగుతుందో? అని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రపంచంలో మట్టి లేకపోతే మొక్కలు, చెట్లు పెరగవు.. ఎక్కువ యూరియా వాడడంతో భూమికి తీవ్ర నష్టం జరుగుతోంది. 2022 నాటికి ప్రస్తుత యూరియా వాడకాన్ని సగానికి తగ్గించేలా మన రైతులు తీర్మానం చేయాలి’ అని కోరారు. దివ్యాంగులు అన్ని రంగాల్లోను అద్భుత ప్రతిభ చూపుతున్నారని మోదీ కొనియాడారు. ‘రియో ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు , అంధుల క్రికెట్‌లో టీ20 విజేతగా నిలిచారు. అనేక సామాజిక కార్యక్రమాల్లో దివ్యాంగులు విశేష కృషి చేస్తూ పోటీ పడుతున్నారు’ అని ప్రధాని అన్నారు. తన గ్రామాన్ని బహిర్భూమి రహితంగా మార్చేందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన 8 ఏళ్ల బాలుడు తుషార్‌ తీసుకున్న నిర్ణయాన్ని మోదీ ప్రశంసించారు.  

మరిన్ని వార్తలు