భారాన్ని ఇథనాల్‌తో తగ్గిద్దాం!

11 Aug, 2018 03:17 IST|Sakshi

ఇంధన దిగుమతులపై ప్రధాని మోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: వచ్చే నాలుగేళ్లలో ఇథనాల్‌ ఉత్పత్తిని మూడింతలు పెంచాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చెరకు నుంచి సంగ్రహించే ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం వల్ల ఇంధన దిగుమతులకు వెచ్చిస్తున్న వ్యయంలో రూ.12 వేల కోట్లను ఆదాచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రూ.10 వేల కోట్ల వ్యయంతో 12 జీవ ఇంధన శుద్ధి కర్మాగారాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. పంట అవశేషాలు, పట్టణ ప్రాంతాల వ్యర్థాల నుంచి ఈ కేంద్రాలు ఇంధనాన్ని తయారుచేస్తాయని తెలిపారు. స్వచ్ఛ భారత్, రైతుల ఆదాయం రెట్టింపునకు జీవ ఇంధనాలు సహకారం అందిస్తాయన్నారు. అభివృద్ధి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులిచ్చే సింగిల్‌ విండో వెబ్‌ పోర్టల్‌ ‘పరివేశ్‌’ను ప్రారంభించారు.

రైతుకు ఆదాయం, యువతకు ఉపాధి..
జీవ ఇంధనాలు పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, ముడిచమురుపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంతో పాటు, రైతులకు అదనపు ఆదాయం సమకూరడంలో అవి దోహదపడతాయన్నారు. ‘2013–14లో పెట్రోల్‌లో కలిపిన ఇథనాల్‌ పరిమాణం 38 కోట్ల లీటర్లు ఉండగా, 2017–18 నాటికి 141 కోట్ల లీటర్లకు చేరింది. దీంతో ఇంధన దిగుమతుల బిల్లులో రూ.4 వేల కోట్లు ఆదా అయ్యాయి’ అని మోదీ అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా