పాక్పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

16 Oct, 2016 13:08 IST|Sakshi
పాక్పై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ

బెనౌలిమ్(గోవా) : బ్రిక్స్ సదస్సు వేదికగా పాకిస్తాన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొరుగు దేశాల నుంచే ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని మోదీ స్పష్టం చేశారు. అయితే ప్రధాని మోదీ నేరుగా పాకిస్తాన్ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ... పాక్ తీరును ఎండగట్టారు. ఓ పొరుగు దేశం ఉగ్రవాదాన్ని తయారు చేసి రవాణా చేస్తోందని నరేంద్ర మోదీ పరోక్షంగా పాక్పై మండిపడ్డారు. ప‌ర్యావ‌ర‌ణ శ్రేయ‌స్సుకు ఉగ్ర‌వాదం విఘాతం క‌లిగిస్తోంద‌న్న ఆయన దుర‌దృష్ట‌వ‌శాత్తు దాని మూలాలు త‌మ పొరుగుదేశంలోనే ఉన్నాయ‌న్నారు.

బ్రిక్స్ సదస్సులో భాగంగా రెండోరోజు సమావేశంలో ఉగ్రవాదంపై మోదీ తన గళాన్ని విప్పారు.  ప్ర‌పంచంలో ఉన్న ఉగ్ర‌వాద సంస్థ‌ల మూలాల‌న్నీ పాకిస్థాన్‌లోనే ఉన్నాయ‌ని ఆయన ఘాటుగా విమర్శించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాల్సిన అవసరం ఉందని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద నిర్మూనలకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.  ఉగ్రవాదం వల్ల శాంతితో పాటు అభివృద్ధి, భద్రతకు  తీవ్రఆటంకం కలుగుతుందని ఆయన అన్నారు.

అస్థిరత  సృష్టించే యత్నాలకు అడ్డుకట్టవేయకపోతే భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదం విషయంలో భిన్నాభిప్రాయాలను సహించేది లేదన్నారు. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశాలు ఇకనైనా తమ మైండ్సెట్ మార్చుకోవాలని మోదీ సూచించారు. కాగా సీమాంతర ఉగ్రవాదంపై పోరాటానికి భారత చర్యలను అర్థం చేసుకుని, మద్దతు ఇవ్వడం పట్ల రష్యాకు మోదీ నిన్న అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. సమావేశం అనంతరం బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఐదు దేశాల అధినేతలు (బ్రెజిల్, భారత్,రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా) కరచాలనం చేస్తూ గ్రూప్ ఫోటో దిగారు.

మరిన్ని వార్తలు