సంప్రదాయ పంచెకట్టు..తామర పూల తులాభారం

8 Jun, 2019 17:42 IST|Sakshi

సంప్రదాయ  పంచెకట్టుతో ఆకట్టుకున్న  ప్రధాని మోదీ

శ్రీకృష్ణ భగవానుడికి   ప్రత్యేక పూజలు

111 కేజీల తామర పూలతో తులాభారం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళ పర్యటనలో భాగంగా ఈ రోజు ( శనివారం) త్రిస్సూర్ జిల్లాలోని  ప్రసిద్ధ గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు. సాంప్రదాయ కేరళ దుస్తులు పంచెకట్టుతో సరికొత్త గెటప్‌లో గురువాయుర్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిబంధనలను పాటించిన మోదీ పంచెకట్టుతో ఆకట్టుకున్నారు. శనివారం ఉదయం  కొచ్చి చేరుకున్న ప్రధాని, కొచ్చిలోని దక్షిణ నావల్ కమాండ్‌కు చెందిన  ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గురువాయూర్ ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు పూర్వ కుంభంతో  దేశ ప్రధానికి ఘన స్వాగతం పలికారు.  అనంతరం  శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మోదీ 'నెయ్యాభిషేకం' ,  'కాలాభాం' వంటి ఇతర ఆలయ ఆచారాలను కూడా పాటించారు. ముఖ్యంగా  111 కిలోల తామర పువ్వులతో తులాభారం సమర్పించారు.  తమిళనాడులోని నాగార్‌కోల్‌ నుంచి ప్రత్యేకంగా  111 కిలోల తామర పువ్వులు  తెప్పించారట.

2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండవసారి ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించిన అనంతరం  నరేంద్ర మోదీ  తొలిసారిగా  గురువాయూర్‌ ఆలయాన్ని సందర్శించారు. 2008లో గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక, గురువాయూర్ ఆలయాన్ని సందర్శించారు మోదీ. కేరళను బీజేపీ  దూరంగా ఉంచుతోందన్న విమర్శల నేపథ్యంలో  తన తొలి పర్యటనకు రాష్ట్రాన్ని ఎంచుకోవడం  ఒక విశేషం కాగా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిపై తనకు ఎంత ప్రేమ ఉందో కేరళపై కూడా అంతే  ప్రేమ ఉందంటూ  మోదీ తన ప్రసంగంలో  భరోసా ఇవ్వడం మరో విశేషం.

మరిన్ని వార్తలు