బాలీవుడ్‌ ప్రముఖులతో ప్రధాని భేటీ

20 Oct, 2019 04:11 IST|Sakshi
మోదీతో బాలీవుడ్‌ ప్రముఖులు ఆమిర్‌ఖాన్, షారూఖ్‌ ఖాన్, కంగనా రనౌత్‌ తదితరులు

గాంధీజీ 150వ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై చర్చ

న్యూఢిల్లీ: మహాత్ముని 150వ జయంత్యుత్సవాల సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ శనివారం తన అధికార నివాసంలో ప్రముఖ బాలీవుడ్‌ నటులు, నిర్మాతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. 2022లో జరుపుకునే 75వ స్వాతంత్య్ర దిన వేడుకలపైనా చర్చించారు. ‘గాంధీ ఎట్‌ 150’ ఇతివృత్తంగా తీసిన వీడియోలను ప్రధాని విడుదల చేశారు.

1857 నుంచి 1947 వరకు జరిగిన స్వాతంత్య్ర పోరాటం, 1947–2022 కాలంలో దేశాభివృద్ధికి సంబంధించి స్ఫూర్తిదాయక కథనాలపై సినీ, టీవీ పరిశ్రమ దృష్టి సారించాలని వారిని కోరారు. కళారంగంలో చూపిసున్న సృజనాత్మకతను దేశంలో పర్యాటకరంగ అభివృద్ధికి ఉపయోగించాలని వారిని కోరారు. ‘మీరెంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. కళాకారులుగా మీ ప్రతిభ ప్రపంచమంతటికీ సుపరిచితం. మీ సృజనాత్మకతను మరింత విస్తరింపజేయడానికి ప్రభుత్వ పరంగా చేతనైనంత సాయం అందిస్తా’అని ప్రధాని మోదీ వారికి తెలిపారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.

ఇటీవల మామల్లపురంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో తాను జరిపిన సమావేశం అనంతరం ఆ ప్రాంతానికి పర్యాటకుల రాక పెరిగిందని తమిళనాడు సీఎంతెలిపారని ప్రధాని వారికి వివరించారు. ‘కళాకారులుగా దేశానికి మేం చేయాల్సింది ఎంతో ఉంది. ప్రధాని మోదీ కూడా ఎన్నో పనులు చేస్తున్నారు’అని అనంతరం ఆమిర్‌ ఖాన్‌ అన్నారు. గాంధీజీని మరోమారు దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని షారుఖ్‌ ఖాన్‌ అన్నారు. ‘సినీ రంగానికి ప్రతినిధులుగా భావిస్తున్న మమ్మల్ని గాంధీజీ ఆదర్శాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు భాగస్వాములుగా చేయడం ద్వారా మా బాధ్యత పెంచారు’అని దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ అన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన వారిలో బోనీ కపూర్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు