Rajasthan Election 2023: మోదీ నినాదం.. అదానీజీ కీ జై

20 Nov, 2023 05:05 IST|Sakshi

నిత్యం 24 గంటలూ అదానీ సేవలో తరిస్తున్న ప్రధానమంత్రి  

రాజస్తాన్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజం  

బుందీ/దౌసా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బడా పారిశ్రామికవేత్త అయిన గౌతమ్‌ అదానీ సేవలో తరిస్తున్నారని, ఆయన కోసమే పని చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. ‘భారత్‌ మాతా జై’ అని చెప్పే మోదీ అదానీ కోసం నిత్యం 24 గంటలూ పరితపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘భారత్‌ మాతాకీ జై’ అనడానికి బదులు ‘అదానీజీ కీ జై’ అని నినదించాలని మోదీకి హితవు పలికారు.

భరతమాత అంటే పేదలు, రైతులు, కారి్మకులేనని స్పష్టం చేశారు. ఆదివారం రాజస్తాన్‌లోని బుందీ, దౌసా జిల్లాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా రాహుల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ రెండు హిందూస్తాన్‌లను సృష్టించాలని భావిస్తున్నారని, అందులో ఒకటి అదానీ కోసం, మరొకటి పేదల కోసం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారని రాహుల్‌ ఆరోపించారు.

దేశవ్యాప్తంగా కుల గణన ఎందుకు నిర్వహించడం లేదని మోదీని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే దేశమంతటా కుల గణన ప్రారంభిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాజస్తాన్‌లోనూ అధికారంలోకి రాగానే కులగణనకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కులగణనతోనే భరతమాత విజయం సాధిస్తుందని వివరించారు.  

రోజుకు మూడుసార్లు దుస్తులు మారుస్తారు
మనదేశంలో బడా పారిశ్రామికవేత్తల్లో ఎవరైనా ఓబీసీలు, దళితులు, గిరిజనులు ఉన్నారా అని రాహుల్‌ ప్రశ్నించారు. రాజస్తాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు. మోదీ రూ.12,000 కోట్లతో విమానం కొనుక్కున్నారని, రోజుకు మూడు సార్లు దుస్తులు మారుస్తారని, రూ.12 కోట్ల విలువైన కారులో ప్రయాణిస్తుంటారని మోదీపై ధ్వజమెత్తారు. తమ జనాభా ఎంత ఉందో చెప్పాలని ఓబీసీ, దళిత, గిరిజన యువత అడిగితే మాత్రం కులాలు లేవని ప్రధానమంత్రి అంటున్నారని దుయ్యబట్టారు. మోదీ 90 మంది ఐఏఎస్‌ అధికారులతో పరిపాలన నడిపిస్తున్నారని, వారిలో ఓబీసీలు ముగ్గురే ఉన్నారని వెల్లడించారు. దేశంలో ఓబీసీల జనాభా 50 శాతం ఉందని, ఐఏఎస్‌లు మాత్రం జనాభాకు తగ్గట్టుగా లేరని తెలిపారు.

మరిన్ని వార్తలు