స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి 

29 Jun, 2020 01:40 IST|Sakshi

లద్దాఖ్‌పై కన్నేసిన వారికి తగిన గుణపాఠం నేర్పాం

కరోనాను ఓడించడం.. దేశ పురోగతే లక్ష్యం

మాసాంతపు మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ వ్యాఖ్య 

న్యూఢిల్లీ: లద్దాఖ్‌ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్‌ తగిన సమాధానం చెప్పిందని ప్రధాని మోదీ తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్‌కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన ఆకాశవాణిలో మాసాంతపు ‘మన్‌కీ బాత్‌’లో మాట్లాడారు. దేశ గౌరవానికి భంగం వాటిల్లబోనివ్వమని మన జవాన్లు నిరూపించారంటూ ప్రధాని.. గల్వాన్‌ ఘటనలో వీరమరణం చెందిన 20 మంది జవాన్లకు నివాళులర్పించారు. స్వయం సమృద్ధి సాధించడమే మన లక్ష్యమని, అదే అమరజవాన్లకు ఘన నివాళి అని పేర్కొన్నారు. విశ్వాసం, స్నేహం, సోదరభావం అనే విలువలకు కట్టుబడి ముందుకు సాగుదామన్నారు. స్థానికంగా తయారైన వస్తువులనే కొని, దేశానికి సేవ చేయాలని, దేశాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలను కోరారు.  దేశీయ వస్తువులను మీరు కొంటున్నారంటే దేశాన్ని బలోపేతం చేయడంలో మీ పాత్ర కూడా ఉన్నట్లే’అని పేర్కొన్నారు.

కరోనాను ఓడించడంపైనే దృష్టి..: దేశం దృష్టి మొత్తం కరోనా వైరస్‌ను నిలువరించడంపైనే ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ అన్‌లాక్‌ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయాలని అన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంత అప్రమత్తత చూపారో అన్‌లాక్‌ సమయంలోనూ అంతే జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరారు. ‘మాస్కు ధరించకున్నా, రెండడుగుల భౌతిక దూరం వంటి ఇతర నిబంధనలను పాటించకున్నా, మీతోపాటు మీ చుట్టుపక్కల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసినట్లేనని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోండి’అని ఆయన ప్రజలను హెచ్చరించారు. అన్‌లాక్‌ సమయంలో ఇతర విషయాల్లోనూ నిబంధనలను ఎత్తివేసినట్లు పేర్కొన్న ప్రధాని.. కొన్ని రంగాల్లో దశాబ్దాలుగా ఉన్న ఆంక్షలను తొలగించినట్లు తెలిపారు.  ఈ ఏడాది తుపానులు, భూకంపాలతో పాటు కొన్ని పొరుగు దేశాల దుష్ట పన్నాగాలను సైతం ఎదుర్కొవాల్సి వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు.

పీవీకి ఉపరాష్ట్రపతి, ప్రధాని నివాళులు 
మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు శత జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధానిగా నాయకత్వ బాధ్యతలు చేపట్టారని వారు కొనియాడారు. ‘మన్‌కీ బాత్‌’లో ప్రధాని మోదీ పీవీ సేవలను శ్లాఘించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు పీవీ నరసింహారావే ఆద్యుడని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  దేశం ఆర్థికంగా కోలుకోవడానికి మార్గం చూపారన్నారు.

భారత్‌లో కోవిడ్‌పై ప్రజాపోరాటం
భారత్‌లో కరోనా మహమ్మారిపై ప్రజలే పోరాటం సాగించారని, దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ ఇందుకు తోడ్పడిందని ప్రధాని మోదీ తెలిపారు. స్వయం సమృద్ధి సాధించేందుకు భారత్‌ కరోనాను కూడా ఒక అవకాశంగా మార్చుకుందన్నారు. ఆదివారం ఆయన అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌(ఏఏపీఐ) వర్చువల్‌ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. 80 వేల మంది వైద్యులకు సభ్యత్వం ఉన్న ఏఏపీఐ సమావేశంలో భారత ప్రధాని ఒకరు ప్రసంగించడం  ఇదే ప్రథమం.
ఆదివారం లేహ్‌ నుంచి చైనా సరిహద్దు వైపు కదులుతున్నభారత్‌ సైనిక వాహనాలు

మరిన్ని వార్తలు