రైలింజన్‌ పైకెక్కి నిరసన.. ఊహించని షాక్‌!

11 Apr, 2018 20:04 IST|Sakshi

సాక్షి, చెన్నై: కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమాలతో జనజీవనం దాదాపు స్తంభించింది. కడలూర్‌, ధర్మపురి, మెట్టూరు, విల్లుపురం ప్రాంతాల్లోనైతే ఆందోళనలు హోరెత్తాయి. బోర్డు ఏర్పాటుచేయమని సుప్రీంకోర్టు చెప్పినా వినిపించుకోకుండా మోదీ సర్కార్‌ ఒంటెత్తుపోకడ పోతున్నదని తమిళపార్టీలు ఆరోపించాయి. కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్‌ నేతృత్వంలోని పీఎంకే పార్టీ రైల్‌రోకోకు పిలుపివ్వగా, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మద్దతు తెలిపింది. ఈ రెండు పార్టీలకుతోడు వందలాది సంఘాలు, వేల మంది రైతులు నిరసనల్లో పాల్గొన్నారు.

ఊహించని షాక్‌: రైల్‌రోకో ఆందోళనలో భాగంగా పీఎంకే కార్యకర్త ఒకరు ఆగిఉన్న రైలింజన్‌ పైకి ఎక్కి నిరసన తెలుపుతుండగా, ఊహించని కరెంట్‌ షాక్‌ తగిలి, మంటలు అంటుకున్నాయి. విల్లుపురం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. షాక్‌కు గురైన వ్యక్తి పేరు రంజిత్‌(32)గా గుర్తించారు. హైవోల్టేజ్‌ ధాటికి అతను మాడి మసైపోయాడని తొలుత వార్తలు వచ్చినా, అది నిజం కాదని వైద్యులు పేర్కొన్నారు. ‘‘హైటెన్షన్‌ వైర్లను అతను ముట్టుకోలేదు. కానీ అత్యంత సమీపానికి వెళ్లడంతో ఒక్కసారే షాక్‌ కొట్టి, మంటలు చెలరేగాయి. ఒక మోస్తారుకు మించి బాధితుడు గాయపడ్డాడని, ప్రాణాపాయం లేనప్పటికీ, కోలుకోవడానికి సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.

>
మరిన్ని వార్తలు