IND Tour Of SA: సౌతాఫ్రికాపై శతక్కొట్టిన తమిళనాడు యువ బ్యాటర్‌

13 Dec, 2023 19:49 IST|Sakshi

తమిళనాడు యువ బ్యాటర్‌ ప్రదోష్‌ రంజన్‌ పాల్‌ సౌతాఫ్రికా గడ్డపై అద్భుత శతకంతో (150 బంతుల్లో 111 నాటౌట్‌; 16 ఫోర్లు, సిక్స్‌) మెరిశాడు. సౌతాఫ్రికా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత ఏ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రదోష్‌.. ఓ పక్క తనకంటే సీనియర్లైన ఆటగాళ్లు పెవిలియన్‌కు చేరుతున్నా, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేస్తూ తన జట్టుకుగౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. చెత్త బంతులను బౌండరీలుగా తరలించిన ప్రదోష్‌.. సమయానుగుణంగా డిఫెన్స్‌ ఆడుతూ సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు.

ప్రదోష్‌కు మరో యువ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ (68) సహకరించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. భారత బ్యాటర్లలో సాయి సుదర్శన్‌ (14), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (30), కెప్టెన్‌ శ్రీకర్‌ భరత్‌ (6), దృవ్‌ జురెల్‌ (0) తక్కువ స్కోర్లకే ఔటైనా ప్రదోష్‌.. సర్ఫరాజ్‌ ఖాన్‌ సహకారంతో భారత ఇన్నింగ్స్‌ను తీర్చిదిద్దాడు. ఇండియా-ఏ తరఫున తన తొలి మ్యాచ్‌ ఆడుతున్న ప్రదోష్‌.. తన 14 ఇన్నింగ్స్‌ల ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో నాలుగో శతకాన్ని బాదాడు.   

అంతకుముందు టీమిండియా పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్ల ప్రదర్శనతో (5/43) చెలరేగడంతో సౌతాఫ్రికా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. ప్రసిద్ద్‌తో పాటు  స్పిన్నర్‌ సౌరభ్‌కుమార్‌ (3/83) రాణించగా.. కావేరప్ప, శార్దూల్‌ ఠాకూర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జీన్‌ డుప్లెసిస్‌ సెంచరీతో (106) కదంతొక్కగా.. రూబిన్‌ హెర్మన్‌ (95) తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో వర్షం కారణంగా తొలి రోజు ఆట పూర్తిగా సాధ్యపడకపోగా.. ప్రస్తుతం మూడో రోజు ఆట కొనసాగుతుంది. 

ఇదిలా ఉంటే, టీమిండియాతో పాటు భారత-ఏ జట్టు కూడా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తుంది. ఓ పక్క టీమిండియా సౌతాఫ్రికా నేషనల్‌ టీమ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు టెస్ట్‌ సిరీస్‌ ఆడనుండగా.. భారత ఏ జట్టు సౌతాఫ్రికా ఏ టీమ్‌తో మూడు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడుతుంది.


 

>
మరిన్ని వార్తలు