పార్టీలకు ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది

29 May, 2018 03:17 IST|Sakshi

వివాదం కావడంతో వివరణ ఇచ్చిన ఈసీ  

న్యూఢిల్లీ: జాతీయ రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ సంస్థల కిందకే వస్తాయనీ, వాటన్నింటికీ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం వర్తిస్తుందని ఎన్నికల సంఘం (ఈసీ) సోమవారం స్పష్టతనిచ్చింది. జాతీయ పార్టీలను ప్రభుత్వ సంస్థలుగా ప్రకటిస్తూ, వాటికీ ఆర్టీఐ చట్టం వర్తిస్తుందని 2013 జూన్‌లోనే కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశాలిచ్చింది. ఈసీ మాత్రం ఇటీవల ఇందుకు విరుద్ధంగా మాట్లాడటం వివాదాస్పదమవడం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలకు విరాళాల ద్వారా వచ్చిన మొత్తమెంతో చెప్పాలని సహ చట్టం కింద ఓ వ్యక్తి దరఖాస్తు చేయగా, ఆ వివరాలు తమ వద్ద లేవనీ, పార్టీలు చట్టం పరిధిలోకి రావంటూ సమాధానమిచ్చింది. ఈ విషయం సోమవారం పత్రికల్లో రావడంతో జాగ్రత్త పడిన ఈసీ తన సమాధానంపై వివరణ ఇచ్చింది.

ఏకకాల ఎన్నికలపై స్పందించని పార్టీలు
లోక్‌సభతోపాటు దేశంలోని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు జరపడంపై అభిప్రాయాలు చెప్పాల్సిందిగా న్యాయ కమిషన్‌ కోరగా, ఏడు జాతీయ పార్టీల్లో ఒక్కటి కూడా స్పందించలేదు. తమ అభిప్రాయాలు చెప్పిన ప్రముఖులు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి,     మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ హెచ్‌ఎస్‌ బ్రహ్మలు మాత్రమే. అభిప్రాయాలు చెప్పేందుకు మే 8 చివరి తేదీ కాగా, ఈసీ గుర్తింపు పొందిన ఏడు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, టీఎంసీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీల్లో ఒక్క పార్టీ కూడా తమ వైఖరిని తెలియజేయలేదు. నారాయణ స్వామి మాత్రం.. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగాన్ని సవరించి కొన్ని శాసనసభల పదవీకాలాన్ని పెంచడం లేదా తగ్గించాల్సి ఉంటుందనీ, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పినట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు