‘ఐపీసీ'పై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

27 Feb, 2016 18:38 IST|Sakshi
‘ఐపీసీ'పై రాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

కొచ్చి: ‘భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)’ 155 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ శిక్షాస్మృతిని సమూలంగా ప్రక్షాళన  చేయాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జేఎన్‌యూ విద్యార్థులపై దేశద్రోహం కేసులు మోపిన నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాలం చెల్లిన ఐపీసీ చట్టాలను ఇంకా యథాతథంగా కొనసాగిస్తుండటంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తున్న విషయం తెలిసిందే.

ఐపీసీకి 155 ఏళ్లు నిండిన సందర్భంగా కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి మాట్లాడుతూ ‘గత 155 ఏళ్లలో ఐపీసీ చాలా తక్కువ మార్పులకు గురైంది. అతి కొద్ది నేరాలు మాత్రమే శిక్షార్హమైన నేరాల జాబితాలో చేరాయి. ఇప్పడు ఇందులో ఉన్న నేరాలు బ్రిటిషు వారి పాలనా సౌలభ్యం కోసం వారే ఏర్పాటు చేసుకున్నారు. జాబితాలో చేరాల్సిన నేరాలు చాలానే ఉన్నాయి. దీన్ని 21వ శతాబ్దానికి అనుగుణంగా మార్చాలి. న్యాయవ్యవస్థను పోలీసులు నిబద్ధతతో అమలు చేయాలి. పురాతన పోలీసు వ్యవస్థను కాలానికి అనుగుణంగా మార్చడం మన న్యాయవ్యవస్థ నెరవేర్చాల్సిన కర్తవ్యం’ అని సూచించారు.
 
 

మరిన్ని వార్తలు