అనూష షా...విల్‌ పవర్‌ ఉన్న సివిల్‌ ఇంజనీర్‌

11 Nov, 2023 00:59 IST|Sakshi

‘నా వృత్తిలో నేను రాణిస్తే చాలు. అదే పదివేలు’ అని సంతృప్తి పడి, సర్దుకుపోయేవాళ్లే ఎక్కువమంది కనిపిస్తారు. ‘నా వృత్తి వల్ల పర్యావరణానికి ఏ మేరకు హాని జరుగుతోంది?’ అని ఆలోచించేవాళ్లు అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన వ్యక్తి... అనూష షా. పచ్చటి ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన అనూషకు పర్యావరణ విలువ తెలుసు.

సివిల్‌ ఇంజనీర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న అనూష వృత్తి విజయాలను చూసి ΄÷ంగిపోవడం కంటే వృత్తికి సామాజిక బాధ్యతను జోడించడానికే అధికప్రాధాన్యత ఇచ్చింది. తన వంతుగా వివిధ వేదికలపై పర్యావరణ హిత ప్రచారాన్ని విస్తృతం చేసింది.
తాజాగా...
బ్రిటన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ (ఐసీయి)కి అధ్యక్షురాలిగా ఎంపికైంది అనూష షా.  రెండు శతాబ్దాల చరిత్ర ఉన్న ప్రతిష్ఠాత్మకమైన  ‘ఐసీయి’ అధ్యక్షత బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయురాలిగా అనూష షా చరిత్ర సృష్టించింది...

‘వాటర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌’లో అనూష షాకు రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.  డిజైనింగ్, మేనేజింగ్‌లో, ప్రాజెక్ట్స్‌–ప్రొగ్రామ్‌లను లీడ్‌ చేయడంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.
‘నిర్మాణం వల్ల నిర్మాణం మాత్రమే జరగడం లేదు. ప్రకృతికి ఎంతో కొంత నష్టం జరుగుతుంది’ అనేది ఒక సామాజిక సత్యం. దీన్ని దృష్టిలో పెట్టుకొని వృత్తికి సామాజిక బాధ్యత కూడా జోడించి ముందుకు వెళుతోంది అనూష.

‘నా వృతి వల్ల నాకు  ఆర్థికంగా మేలు జరగడం మాట ఎలా ఉన్నా, చేటు మాత్రం జరగవద్దు’ అంటోంది అనూష. అందుకే తన వృత్తిలో పర్యావరణ హిత విధానాలను అనుసరిస్తోంది.
‘సివిల్‌ ఇంజనీరింగ్‌ను పీపుల్‌–పాజిటివ్‌ ప్రొఫెషన్‌గా చూడాలనేది నా కల. మౌలిక వసతులు, ప్రకృతికి మధ్య ఉండే అంతఃసంబంధాన్ని అర్థం చేసుకోవడంలో మొదట్లో మేము విఫలమయ్యాం. ఆ తరువాత మాత్రం ప్రకృతికి హాని జరగని విధానాలను అనుసరించాం’ అంటుంది అనూష. అందమైన కశ్మీర్‌లో పుట్టి పెరిగిన అనూషకు ప్రకృతి విలువ తెలుసు.

కశ్మీర్‌లోని దాల్‌ సరస్సు సంరక్షణ కోసం దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ కోసం ఇరవై మూడు సంవత్సరాల వయసులో కన్సల్టింగ్‌ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌గా పనిచేసింది. ఆ తరువాత కామన్‌వెల్త్‌ స్కాలర్‌షిప్‌తో బ్రిటన్‌ వెళ్లి  ‘వాటర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌’లో ఎంఎస్‌సీ చేసింది. ‘΄్లాన్‌ ఫర్‌ ఎర్త్‌’ అనే క్లైమెట్‌ ఛేంజ్‌ కన్సెల్టెన్సీని మొదలు పెట్టి పర్యావరణ సంరక్షణకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. వివిధ పరిశ్రమలకు సంబంధించిన ‘నెట్‌జీరో అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌’ బృందాలతో సమావేశమై విలువైన సూచనలు ఇచ్చింది.

చర్చాకార్యక్రమాల్లో పాల్గొన్నా, వ్యాసాలు రాసినా, టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చినా, సమావేశాల్లో ఉపన్యాసం ఇచ్చినా...ప్రతి అవకాశాన్ని పర్యావరణ హిత ప్రచారానికి ఉపయోగించుకుంది.
 
‘మన గురించి మాత్రమే కాదు భవిష్యత్‌ తరాల గురించి కూడా ఆలోచించాలి. ఉన్నతమైన విలువలతో ప్రయాణించినప్పుడే మన గమ్యస్థానం చేరుకోగలం’ అంటుంది అనూష. ‘క్లైమెట్‌ చేంజ్‌ ఇన్‌ ఇంజనీరింగ్‌’ అంశానికి సంబంధించి అనూష  చేపట్టిన అవగాహన కార్యక్రమాలకు గానూ ‘యూనివర్శిటీ ఆఫ్‌ ఈస్ట్‌ లండన్‌’ నుంచి గౌరవ డాక్టరేట్‌ స్వీకరించింది.

కొన్ని సంవత్సరాల క్రితం బ్రిటన్‌ నుంచి ముంబైకి వచ్చింది అనూష. ఆ సమయంలో తన స్వస్థలం కశ్మీర్‌ను వరదలు ముంచెత్తాయి. ఎంతోమంది చనిపోయారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇది అనూషను బాగా కదిలించింది.  ‘విషాదం నుంచి కూడా నేర్చుకోదగినవి చాలా ఉంటాయి. ఇది అలాంటి విషాదమే’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది అనూష.

‘ముందుచూపు, ముందు జాగ్రత్త ఉన్న వాళ్ల వైపే అదృష్టం మొగ్గు చూపుతుంది’ అనేది అనూష షాకు బాగా ఇష్టమైన మాట.
‘మన వల్ల ఏమవుతుంది అనే భావన కంటే ఔట్‌ ఆఫ్‌ బాక్స్‌లో ఆలోచించి, ధైర్యంగా ముందుకు వెళ్లడం వల్లే ఎక్కువ మేలు జరుగుతుంది. సంకల్పబలం ఉన్న చోట అద్భుతమైన ఫలితాలు వస్తాయి’ అనేది ఆమె బలంగా చెప్పే మాట.  

మరిన్ని వార్తలు