పోటీ నామమాత్రమే..!

23 Jun, 2017 01:05 IST|Sakshi

యూపీఏ, ఇతర విపక్షపార్టీలు మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ను తమ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దింపాయి. వామపక్షాలు చెప్పినట్లు ఇది సైద్ధాంతిక పోటీయే తప్పితే ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ గెలుపు ఖాయమని అంకెలు చెబుతున్నాయి. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం ఓట్ల విలువ 10,98,903. దీంట్లో సగంకన్నా ఒక ఓటు ఎక్కువ (5,49,452 ఓట్లు) వచ్చిన వారు గెలుస్తారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరాన్ని పాటించే తటస్థ పార్టీల్లో.. వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్, బీజేడీ, జేడీయూ, అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు ఎన్డీయే అభ్యర్థికే తమ మద్దతును ప్రకటించాయి.

తాజాగా బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ తమ పార్టీ జేడీయూ మద్దతు కోవింద్‌కు ఉంటుందని ప్రకటించారు. ఎన్డీయే బలానికి వీరి ఓట్లు కూడా తోడైతే కోవింద్‌కు  ప్రస్తుతం ఎలక్టోరల్‌ కాలేజీలో ఉన్న బలం 62.39 శాతం. విజయానికి 5,49,452 ఓట్లు వస్తే సరిపోనుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో కోవింద్‌కు అనుకూల ఓట్లు 6,89,630 కావడం గమనార్హం. దీనిని బట్టి విపక్షపార్టీలు మొక్కుబడిగా పోటీకి దిగుతున్నాయనేది సుస్పష్టం. యూపీఏ అభ్యర్థికి 3,70,804 అనుకూల ఓట్లున్నాయి. అంటే ఎలక్టోరల్‌ కాలేజీలో వీరికి 33.58 శాతం మద్దతుంది. ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న ఆప్‌ (0.82 శాతం), ఐఎన్‌ఎల్‌డీ (0.38 శాతం), స్వతంత్రులు, ఇతర చిన్నాచితక పార్టీలు ఏ వైఖరి తీసుకున్నా అంతిమఫలితంపై ప్రభావమేమీ ఉండదు.

ఎన్డీఏకు మద్దతిస్తున్న ఇతర పార్టీలు
పార్టీ                     ఓట్ల విలువ                 శాతం
వైఎస్సార్‌సీపీ           16,848                     1.53
టీఆర్‌ఎస్‌                22,048                    1.99
బీజేడీ                    32,892                    2.98
అన్నాడీఎంకే            59,224                    5.36
(రెండు వర్గాలు)
జేడీయూ               20,935                     1.89
మొత్తం                1,51,947                   13.75

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు