గంటల కొద్దీ కోతలు.. ఢిల్లీలో ఆగ్రహజ్వాలలు

12 Jun, 2014 04:03 IST|Sakshi
గంటల కొద్దీ కోతలు.. ఢిల్లీలో ఆగ్రహజ్వాలలు

 సాక్షి, న్యూఢిల్లీ:విద్యుత్, నీటి కొరత సమస్యలపై ఢిల్లీవాసుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దీంతో వారి నిరసన ప్రదర్శనలు హింసా రూపం దాలుస్తున్నాయి. విద్యుత్ కోతపై భజన్‌పురివాసులు మంగళవారం రాత్రి ఓ డీటీసీ బస్సు అద్దాలు పగులగొట్టి నిప్పంటించారు. అంతటితో ఆగకుండా పోలీసు జీపును ధ్వంసం చేశారు. నీటి  కొరత సమస్యను నిరసిస్తూ నాంగ్లోయ్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు మట్కాఫోడ్ ప్రదర్శన నిర్వహించారు. మహిళలు కుండలు పగులగొట్టి నిరసన వ్యక్తం చేశారు. నిప్పుల కొలిమిని తలపిస్తోన్న రాజధానిలో విద్యుత్ సరఫరాలో కోత, నీటి సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచే స్తోంది.

ఎన్డీఎంసీ వంటి వీఐపీ ప్రాంతాలను మినహాయిస్తే నగరమంతటా కోతలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల రెండు నుంచి పది గంటల పాటు కోత విధిస్తున్నారు. తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో విద్యుత్ కోత సమస్య తీవ్ర రూపం దాల్చింది. రాత్రి మొత్తం విద్యుత్ సరఫరా లేకపోవడంతో నానాయాతనకు గురవుతున్నామని నగరవాసులు వాపోతున్నారు. విద్యుత్ కోత సమస్య పరిష్కారానికి మరో రెండు వారాలు పడుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పడం నగరవాసులలో  మరింత నిరాశకు గురిచేసింది. భజన్‌పురా ప్రాంతంలో ఆగ్రహించిన ప్రజలు రాళ్లు రువ్వి ఓ జిప్సీతోపాటు డీటీసీ బస్సును ధ్వంసం చేశారు. ఈ ఘటనకు సంబంధించి  ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆదనపు పోలీస్ కమిషనర్ వి.వి.చౌదరి చెప్పారు.
 
 కష్టాలు తప్పేదెప్పుడో..!
 రాజధాని వాసులు కరెంట్ కష్టాల నుంచి బయటపడే పరిస్థితులు ఇప్పట్లో కనిపించడం లేదు. నగరంలోని అనేక ప్రాంతవాసులు రోజుకు పది నుంచి పన్నెండు గంటల పాటు విద్యుత్ కోతలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు భరించలేని ఎండవేడిమి, మరోవైపు విద్యుత్‌కోతల కారణంగా పిల్లలు, వయోవృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ కోతల ప్రభావం అనేక ప్రాంతాల్లో నీటిసరఫరాపై పడింది. విద్యుత్ కోతలకు నిరసనగా కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే జైకిషన్ నిరాహారదీక్షకు దిగారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం డిస్కాంలకు రక్షణ కల్పిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తాము ప్రతిరోజు పది నుంచి 12 గంటల పాటు విద్యుత్ కోతలను ఎదుర్కొంటున్నామని సుల్తాన్‌పురీ వాసులు ఆరోపించారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని, విద్యుత్ కోతల కారణంగా తమ ప్రాంతానికి నీటి సరఫరా కూడా సరిగ్గా జరగడం లేదని వారు వాపోయారు. తమ పిల్లలు పరీక్షలకు సిద్ధం కాలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తాను నిరాహారదీక్షకు దిగాలని నిర్ణయించానని స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జైకిషన్ చెప్పారు. ఇతర పార్టీ నాయకులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తానని తెలిపారు.
 

మరిన్ని వార్తలు