జామియా విద్యార్థులపై కాల్పులు

31 Jan, 2020 05:00 IST|Sakshi
ఢిల్లీలో జామియా వర్సిటీ సమీపంలో ఆందోళన చేస్తున్న నిరసనకారులపైకి కాల్పులు జరుపుతున్న రాంభక్త్‌

ఢిల్లీలో రాంభక్త్‌ గోపాల్‌ కలకలం

కాల్పులకు ముందు ‘ఫేస్‌బుక్‌ లైవ్‌’

‘ఖేల్‌ ఖతమ్‌’ అంటూ పోస్ట్‌లు

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా విశ్వవిద్యాలయం వద్ద జరుగుతున్న ఆందోళనల్లో గురువారం కలకలం చెలరేగింది. ఆగంతకుడు ఒకరు తుపాకీతో జరిపిన కాల్పుల్లో ఓ విద్యార్థి గాయపడ్డాడు. ఆ ఘటనకు నిరసనగా వందలాది మంది ప్రజలు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసుల బ్యారికేడ్లను తోసుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాల్పులకు తెగబడిన తరువాత ఆ వ్యక్తి సంఘటన స్థలం నుంచి నింపాదిగా నడుచుకుంటూ వెళ్తూ చేతిలోని తుపాకీని గాల్లో ఊపుతూ ‘తీసుకోండి స్వాతంత్య్రం’అని వ్యాఖ్యానించడం గమనార్హం.

అప్పటివరకూ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిన అక్కడి పోలీసులు ఒక్కసారిగా మేలుకొని కొంతమంది ఆందోళనకారుల సాయంతో కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకోగలిగారు. ఈ మొత్తం వ్యవహారంతో ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో కొంత సమయం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నల్లటి జాకెట్‌ తొడుక్కున్న ఆ వ్యక్తి తనను తాను ‘రాం భక్త్‌ గోపాల్‌’గా చెప్పుకున్నాడు. గోపాల్‌ కాల్పులకు పాల్పడేందుకు కొద్దిసేపటికి ముందే ఫేస్‌బుక్‌ లైవ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘షహీన్‌బాగ్‌ ఖేల్‌ ఖతమ్‌’అంటూ అతడు ఒక పోస్ట్‌ పెట్టాడు. తన అంతిమయాత్రలో తన శరీరాన్ని కాషాయ వస్త్రంతో చుట్టాలని, జైశ్రీరామ్‌ నినాదాలు చేయాలని అతడు మరో పోస్ట్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల తాలూకూ స్క్రీన్‌షాట్లు వైరల్‌కావడంతో అతడి ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ను తొలగించారు.  

‘పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన హోలీ ఫ్యామిలీ ఆస్పత్రి వైపు వెళ్తున్నాం. అకస్మాత్తుగా ఓ వ్యక్తి తుపాకీతో మా ముందుకొచ్చాడు. కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్‌ షాబాద్‌ ఫారూఖ్‌ చేతికి తగిలింది’అని ఆమా ఆసిఫ్‌ అనే విద్యార్థిని తెలిపింది. షాబాద్‌ను ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ ట్రామా సెంటర్‌కు తరలించారని వివరించింది. పలువురు ఇతర విద్యార్థులు ఘటన తీరును అనంతర పరిస్థితులను వివరించారు.  

జామియా మిలియా విద్యార్థులు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మహాత్మాగాంధీ స్మారకం రాజ్‌ఘాట్‌ వద్దకు ర్యాలీగా వెళ్తుండగా.. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల ర్యాలీకి అనుమతి లేదని డీసీపీ చిన్మయ్‌ బిశ్వాల్‌ తెలిపారు. ‘నిరసన శాంతియుతంగా జరుపుకోవాలని పదేపదే చెబుతున్న తరుణంలో ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం’అని బిశ్వాల్‌ తెలిపారు.  

కఠినంగా వ్యవహరించండి
జామియా మిలియా వర్సిటీ వద్ద నిరసనకారులపై కాల్పులు జరిపిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అమిత్‌ షా ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ను ఆదేశించారు. ఇలాంటి ఘటనలను కేంద్రం సహించబోదని, దోషులను వదిలేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ స్పెషల్‌ కమిషనర్‌ ప్రవీర్‌ రంజన్‌ దర్యాప్తు చేస్తారని, కేసు పురోగతిని స్వయంగా సమీక్షించనున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు. జామియా మిలియా వర్సిటీ వద్ద బుధవారం జరిగిన సీఏఏ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒక విద్యార్థి గాయపడిన విషయం తెలిసిందే. రాంభక్త్‌ గోపాల్‌ అని చెప్పుకునే ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు