Delhi Pollution Update: ఢిల్లీలో మరికొద్ది రోజుల ఇంతే..

22 Nov, 2023 07:58 IST|Sakshi

ఢిల్లీని మరోమారు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఫలితంగా విజిబులిటీ దెబ్బతినడమే కాకుండా జనం విషవాయువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం రాజధానిలోని ఐదు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 లేదా అంతకంటే ఎక్కువ అంటే ‘తీవ్రమైన’ విభాగంలోకి చేరుకుంది. మరో మూడు నాలుగు రోజులపాటు ఈ విషపూరితమైన గాలి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఢిల్లీ ప్రజలకు లేదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

కాగా గాలి దిశ, వేగం మారడంతో శని, ఆదివారాల్లో కాలుష్య స్థాయిలో కొంత మెరుగుదల కనిపించింది. అయితే ఇప్పుడు గాలిలో ఉధృతి ఏర్పడిన కారణంగా కాలుష్య స్థాయి మళ్లీ పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సూర్యరశ్మి బలహీనంగా మారి వాతావరణంలో పొగమంచు కమ్ముకుంది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు దృశ్యమాన స్థాయి 1500 మీటర్ల వరకు ఉంది. సాధారణంగా రెండు వేల మీటర్లు ఉండాలి.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఢిల్లీలో ఏక్యూఐ 372గా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. గాలిలో తేమ స్థాయి 95 నుంచి 56 శాతంగా నమోదైంది. లోధి రోడ్డు అత్యంత శీతల ప్రాంతం. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బుధవారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఇది కూడా చదవండి: అమేథీలో మళ్లీ రాహుల్‌ Vs స్మృతి?

మరిన్ని వార్తలు