వారు చితక్కొట్టడంతోనే నా కొడుకు ఉగ్రవాదయ్యాడు

16 Feb, 2019 11:02 IST|Sakshi

సూసైడ్‌ బాంబర్‌ ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ తల్లిదండ్రులు 

శ్రీనగర్‌ : మూడేళ్ల క్రితం భారత బలగాలు తన కొడుకును చితక్కొట్టడంతోనే మిలిటెంట్‌ గ్రూప్‌లో చేరాడని సూసైడర్‌ బాంబర్‌, ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ తల్లిదండ్రులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆదిల్‌ ఆత్మహుతికి దాడికి తెగబడి 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. ఆదిల్‌ ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకొని జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకొని ఓ బస్సును ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ దాడిపై దుండగుడు ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ తల్లిదండ్రులు రాయిటర్స్‌ ప్రతినిధితో మాట్లాడారు.

ఈ ఉగ్రదాడిలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకున్న బాధే తమకు ఉందని ఆదిల్‌ అహ్మద్‌ దార్‌ తండ్రి గులామ్‌ అహ్మద్‌ దార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.  2016లో తన కొడుకు అతని స్నేహితులు స్కూల్‌ నుంచి తిరిగి వస్తుండగా.. భారత సైనికులు అడ్డుకొని చితక్కొట్టారని, ఈ ఘటనతోనే ఆదిల్‌ ఉగ్రవాద గ్రూప్‌ల పట్ల ఆకర్షితుడయ్యాడని తెలిపాడు. అప్పటి నుంచి భారత సైనికులపై కోపం పెంచుకున్నాడని అతని తల్లి ఫహమీదా పేర్కొంది. ఇక తన కొడుకు ఇంత దారుణానికి ఒడిగడతాడనుకోలేదని, ఈ దాడి వ్యూహం తమకు తెలియదన్నారు. గతేడాది మార్చి 19 నుంచి ఆదిల్‌.. పని చేసే చోటు నుంచి అదృశ్యమయ్యాడని, అప్పటి నుంచి జాడలేడన్నారు. అతని జాడ కోసం మూడు నెలలుగా ప్రయత్నించి ఆశ చాలించుకున్నామన్నారు. తన కొడుకు మరణానికి దేశంలోని రాజకీయనాయకులే కారణమని, కశ్మీర్‌ సమస్యపై తేల్చకుండా నాన్చుతున్నారని గులామ్‌ అసహనం వ్యక్తం చేశాడు. ఈ అంశం తేలే వరకు.. తమలాంటి పేదల పిల్లలు, భారత జవాన్ల ప్రాణాలు పోతూనే ఉంటాయని ఆవేదన వ్యక్తం చేశాడు. (చదవండి: ఈ వీడియోను చూసేలోగా స్వర్గంలో ఉంటా!)

మరిన్ని వార్తలు