రైలులో కలుషితాహారం.. 40 మందికి అస్వస్థత

23 May, 2018 20:58 IST|Sakshi
ఖరగ్‌పూర్‌ రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుత్ను బాధితులు

ఖరగ్‌పూర్‌/పశ్చిమ బెంగాల్‌: పూరి-హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఐఆర్‌సీటీసీ సరఫరా చేసిన అల్పాహారం తిని నలభై మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 14మంది ఖరగ్‌పూర్‌లోని రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పూరి నుంచి బయల్దేరిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్‌ దాటిన తర్వాత అల్పాహారంగా ఆమ్లెట్‌, బ్రెడ్‌ తీసుకున్నామని బాధితులు చెప్పారు.

అల్పాహారం తీసుకున్న అనంతరం వాంతులు, కడుపులో నొప్పి మొదలైందని వారు తెలిపారు. రైలు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా ఖరగ్‌పూర్‌ రైల్వే ఆస్పత్రిలో చేర్పించారని పేర్కొన్నారు. కాగా, రైలు ప్రయాణంలో నాణ్యమైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పే రైల్వే శాఖ ఈ విషయం వెలుగు చూడడంతో చర్యలకు ఉపక్రమించింది. ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. 

‘ఐఆర్‌సీటీసీ పంపిణీ చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ తిని 40 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో 14  మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నార’ని ఆగ్నేయ రైల్వే జోన్‌ ప్రజా సంబంధాల అధికారి సంజయ్‌ ఘోష్‌ తెలిపారు.  ‘ఆహార పదార్థాల నమూనాలు సేకరించాం. బాధ్యులైన వారిపై చర్యలు చేపడతామ’ని ఖరగ్‌పూర్‌ డివిజన్‌ మేనేజర్‌ రాబిన్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెండర్‌ వద్ద కాకుండా బయటి వ్యక్తుల నుంచి ఆహార పదార్థాలేవైనా కొన్నారా అనే విషయం తెలియాల్సి ఉందన్నారు.

భోజన వసతి అనుకున్నాం.. ఆస్పత్రి పాలయ్యాం
‘పూరి పర్యటనకు వచ్చాం. భోజన వసతి ఉంటుందని శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు పయనమయ్యాం. కానీ ఇలా ఆస్పత్రి పాలవుతామనుకోలేద’ని బెంగాల్‌కు చెందిన రూపమ్‌ సేన్‌ గుప్తా వాపోయారు. రైలులో ఐఆర్‌సీటీసీ సరఫరా చేసిన ఆహారాన్నే కొన్నామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు