రాఫెల్‌ డీల్‌ భారత్‌కు లాభదాయకం

4 Oct, 2018 06:29 IST|Sakshi

న్యూఢిల్లీ: రాఫెల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలుపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న వేళ వాయుసేన(ఐఏఎఫ్‌) అధిపతి బీఎస్‌ ధనోవా ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఫ్రాన్స్‌తో 36 రాఫెల్‌ యుద్ధవిమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందం భారత్‌కు చాలా లాభదాయకమన్నారు. రాఫెల్‌ కొనుగోలుతో ఉపఖండంలో బలాబలాలు, సమీకరణాలు మారిపోతాయని ధనోవా అన్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘భారత వాయుసేనలో యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోతున్న వేళ అత్యవసరంగా 36 రాఫెల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలుకు కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందంలో భాగంగా తన భారతీయ భాగస్వామి రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఫ్రెంచ్‌ కంపెనీ డసో ఏవియేషన్‌ స్వచ్ఛందంగా ఎంచుకుంది. దీంట్లో కేంద్రం లేదా ఐఏఎఫ్‌ జోక్యం ఎంతమాత్రం లేదు. ఈ వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన సందర్భంగా ఎస్‌–400 ట్రయంఫ్‌ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ కొనుగోలు ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేయనున్నాయి. ఎస్‌–400కు తోడు రాఫెల్‌ ఫైటర్‌ జెట్లతో భారత గగనతలం శత్రు దుర్భేద్యం అవుతుంది. సుఖోయ్‌–30, సుఖోయ్‌–25 యుద్ధవిమానాల అందజేతలో మూడేళ్లు, జాగ్వార్‌ అందజేతలో ఆరేళ్లు హాల్‌ వెనుకపడి ఉందని ధనోవా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు