పెళ్లిపై స్పందించిన రాహుల్‌ గాంధీ

14 Aug, 2018 11:58 IST|Sakshi
పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రాహుల్‌ గాంధీ

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీతో తన వివాహం జరిగిపోయిందని ఆ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ అన్నారు. మీడియా ఎడిటర్ల సమావేశంలో తన పెళ్లిపై స్పందిస్తూ రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవన్నారు. మోదీ ఊహల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీకి 230 సీట్లు రాకుంటే మోదీ ప్రధాని కాలేరని, ఆ సందర్భంలో బీజేపీ మరొకరని ప్రధానిగా ప్రతిపాదిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా హైదరాబాద్‌ పర్యటనలో రాహుల్‌ రెండో రోజూ బిజీబిజీగా గడిపారు.

మంగళవారం ఉదయం బేగంపేట హరిత ప్లాజా హోటల్‌లో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. సమావేశంలో నేతలను ఉద్దేశించి ఫిర్యాదులు చేయవద్దని, సలహాలు.. సూచనలు మాత్రమే ఇవ్వాలని కోరారు. పార్టీ కీలక నేతల భేటీ సందర్భంగా వేదిక వద్ద సీఎల్పీ నేత జానారెడ్డికి అవమానం జరిగింది. జాబితాలో ఆయన పేరు లేదంటూ జానారెడ్డిని పక్కకు జరగాలంటూ ఎస్పీజీ సెక్యూరిటీ ఆపేయడంతో ఆయన అలక బూనారు. పరిస్థితిని గుర్తించి అప్రమత్తమైన పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జానాను బుజ్జగించి సమావేశానికి తీసుకెళ్లారు. ఈ భేటీ ముగిసిన అనంతరం మీడియా ఎడిటర్లతో రాహుల్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 90 మంది మీడియా ఎడిటర్లు పాల్గొన్నారు.


పార్టీ ముఖ్య నేతల సమావేశంలో రాహుల్‌ గాంధీ

పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌..
పార్టీ ముఖ్య నేతలతో భేటీకి ముందు పార్టీ నాయకులు 3000 మందితో టెలికాన్ఫరెన్స్‌లో రాహుల్‌ మాట్లాడారు. నలుగురు బూత్‌ కమిటీ నాయకులతో ఆయన మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గం బికనూర్‌ నేతలతో పాటు జుక్కల్‌, డోర్నకల్‌ నియోజకవర్గ బూత్‌ కమిటీ నాయకులతో మాట్లాడారు. జాతీయ స్ధాయిలో ఇలాంటి టెలికాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాలని ఛార్మ్స్‌ ఇన్‌చార్జ్‌ మదన్‌మోహన్‌ను కోరారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల కేటాయింపుతో పాటు కేసీఆర్‌ పాలనపై బూత్‌ కమిటీ నాయకులను రాహుల్‌ ఆరా తీశారు.

మరిన్ని వార్తలు