మీ పాపాలు మటాష్.. ఇదిగో సర్టిఫికెట్!

25 May, 2016 15:25 IST|Sakshi
మీ పాపాలు మటాష్.. ఇదిగో సర్టిఫికెట్!

పాపాలు చేశామన్న భయంతోనే చాలామంది రకరకాల మందిరాల చుట్టూ తిరుగుతుంటారు. అయితే, అలా వెళ్లినంత మాత్రాన పాపం పోతుందని గ్యారంటీ ఏంటని అడిగేవాళ్లు కూడా లేకపోలేరు. అందుకే రాజస్థాన్‌లోని ఓ ఆలయంలోని కొలనులో స్నానం చేసి, రూ. 11 దక్షిణ ఇస్తే చాలు.. పాపాల నుంచి పూర్తిగా విముక్తి లభించినట్లు ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తారట. ప్రతాప్‌గఢ్ జిల్లాలో ఉన్న గోమఠేశ్వర్ మహాదేవ పాపమోచన్ తీర్థ అనే అనే శివాలయంలో మాత్రం పాపముక్తి సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారట. అది కూడా ఈమధ్య వచ్చింది కాదు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అక్కడ గల మందాకినీ కుండంలో స్నానం చేసి, శివాలయంలో పూజలు చేసుకుని వస్తే వాళ్లకు పాపవిముక్తి సర్టిఫికెట్లు ఇస్తున్నారు. సర్టిఫికెట్ ఖరీదు కేవలం ఒక్క రూపాయేనట. మిగిలిన 10 రూపాయలు దోషనివారణ కోసం అని చెబుతున్నారు.

చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడికొచ్చి, పాపముక్తి సర్టిఫికెట్లు తీసుకుని వెళ్తున్నట్లు ప్రధానార్చకుడు నందకిశోర్ శర్మ చెబుతున్నారు. ఈ ఆలయానికి గిరిజనుల హరిద్వార్‌గా గుర్తింపు ఉంది. కొన్ని శతాబ్దాలుగా ఇక్కడకు భక్తుల రాకపోకలు బాగున్నాయని ముఖ్యంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో వస్తారని అంటున్నారు. ప్రధానంగా మే నెలలో నిర్వహించే గోమఠేశ్వర తీర్థానికి లక్షల్లో భక్తులు వస్తారని శర్మ తెలిపారు. ఇటీవలి కాలంలో భక్తుల సంఖ్య పెరిగినా, సర్టిఫికెట్లు తీసుకునేవాళ్లు మాత్రం తగ్గారట. ఈసారి మేలో జరిగిన 8 రోజుల తీర్థంలో దాదాపు రెండు లక్షల మంది పాల్గొన్నా, కేవలం మూడు సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చారు. రైతులు వ్యవసాయం చేసేటపుడు చాలా రకాల కీటకాలు చనిపోతాయని, వాళ్లు పాపభీతితో బాధపడుతూ ఇక్కడికొచ్చి పాపవిముక్తి చేసుకుంటారని మరో పూజారి కన్హయ్యలాల్ శర్మ చెప్పారు.

మరిన్ని వార్తలు