‘బ్రహ్మజ్ఞాని’ రేప్‌ చేయటం పాపం కాదట!

27 Apr, 2018 01:42 IST|Sakshi

ఆసారాం వ్యాఖ్యలను కోర్టులో చెప్పిన ప్రత్యక్ష సాక్షి

జోధ్‌పూర్‌: బాలికలను తనలాంటి బ్రహ్మజ్ఞాని  రేప్‌చేయడం పాపం కాదని ఆసారాం బాపు చెప్పేవాడని అతని మాజీ శిష్యుడు రాహుల్‌ కె.సచార్‌ జోధ్‌పూర్‌ కోర్టుకు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం ఓ బాలికను రేప్‌చేసిన కేసులో ఆసారాంకు యావజ్జీవ జైలు శిక్ష పడటం తెల్సిందే. కోర్టు తన తీర్పులో ప్రత్యక్ష సాక్షి రాహుల్‌ సచార్‌ చెప్పిన విషయాలను  వెల్లడించింది.  పుష్కర్‌(రాజస్తాన్‌), భివానీ (హర్యానా), అహ్మదాబాద్‌ (గుజరాత్‌)లోని ఆశ్రమాల్లో 2003లో ఆసారాం బాలికలను వేధించటం చూశానని సచార్‌ చెప్పాడు. ‘ఆశ్రమంలో ఆసారాం వెంటే ముగ్గురు బాలికలుండేవారు.

వారితో ఆశ్రమంలో కలియ దిరుగుతూ టార్చిలైట్‌తో సైగలు చేసేవాడు. అలా ఎంపిక చేసిన బాలికను ఆ ముగ్గురూ బాబా నివాసంలోకి పంపేవారు. ఈ ముగ్గురు బాలికలే ఆసారాం పాపానికి బలైన బాధితులకు గర్భస్రావం చేయించేవారు. అహ్మదాబాద్‌లో బాబా ఓ బాలికను వేధిస్తుంటే ప్రత్యక్షంగా చూశా. బాబాను నిలదీశా. బ్రహ్మజ్ఞాని అలాంటివి చేయటం పాపం కాదని ఆసారాం బదులిచ్చాడు. ప్రశ్నించినందుకు నన్ను బయటకు గెంటించాడు. లైంగిక సామర్థ్యం పెంపు కోసం నల్లమందుతోపాటు ఇతర మందులను వాడే వాడు’ అని సచార్‌ తెలిపారు. ఆశ్రమం నుంచి బయటకొచ్చాకా దాడికి పాల్పడ్డారన్నారు.

మరిన్ని వార్తలు